అంతరించి పోతున్న పొనికి చెట్టుకు కొత్త జీవం.. ములుగు అటవీ కళాశాల సరికొత్త ఆవిష్కరణ

by Ramesh Naini |

ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి వినియోగించే పొనికి చెట్టు పునరుత్పత్తికి ములుగు అటవీ కళాశాల శ్రీకారం చుట్టింది.

అంతరించి పోతున్న పొనికి చెట్టుకు కొత్త జీవం.. ములుగు అటవీ కళాశాల సరికొత్త ఆవిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన (Nirmal doll making) నిర్మల్ బొమ్మల తయారీకి వినియోగించే పొనికి చెట్టు (Poniki tree) పునరుత్పత్తికి ములుగు అటవీ కళాశాల (Mulugu Forest College) శ్రీకారం చుట్టింది. అటవీ కళాశాలలో ఎమ్మెస్సీ రీసర్చ్ స్కాలర్ విద్యార్థి మాలోత్ మౌనిక పొనికి విత్తనాల జెర్మినేషన్ ను ఆవిష్కరించింది. చెక్క బొమ్మల తయ్యారికీ ఉపయోగించే అత్యంత అరుదైన వృక్ష జాతికి చెందిన పొనికి చెట్టు ఉనికి రోజు రోజుకి అంతరించిపోతుంది. దీనిని పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా పునర్వైభవం సాధించవచ్చని స్కాలర్ విద్యార్థి మాలోతు మౌనిక నిరూపించారు. పొనికి చెట్టును శాస్త్రీయ నామం (Givotia rottleriformis) గీవోటియా రొట్లేరి ఫార్మీస్‌గా పిలుస్తారు. దీని కలప మృదువుగాను, తేలికగా ఉంటుంది. ఈ పొనికి కలపతో నిర్మల్ బొమ్మలు, సాంప్రదాయ కళాఖండాలు తయారు చేస్తారు. అయితే, ఈ జాతి వృక్షం నిరాదరణకు గురికావడం, పేలవమైన పునరుత్పత్తి, విత్తనాల నాణ్యత లోపించడం, సరైన భూసారం లేకపోవడంతో అంతరించే జాతి చెట్ల జాబితాలో చేరింది.

అంతరించిపోతున్న జాబితాలో చేరిన ఈ జాతి చెట్లపై దృష్టి సారించిన ములుగు అటవీ కళాశాల ఆధ్వర్యంలో పరిశోదనలు చేపట్టారు. అనంతరం వెల్లడైన ఫలితాల్లో పొనికి చెట్ల విత్తనాల అంకురోత్పత్తి, పొనికి చెట్ల పునరుత్పత్తిలో గణనీయమైన విజయాన్ని సాధించిందినట్లు కళాశాల డీన్ కృష్ణ పేర్కొన్నారు. అటవీ కళాశాలకు చెందిన మాలోతు మౌనిక ట్రీ బ్రీడింగ్, ఇంప్రూవ్ మెంట్ విభాగంలో పరిశోదనలు నిర్వహించారు. అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రీజా సుందరం గైడెన్స్ లో చేపట్టిన ఈ పొనికి విత్తనాల జెర్మినేషన్ రేటు 80 శాతం వరకు వచ్చేలా విజయం సాధించారు. వీరు ఇటీవల చేపట్టిన ఈ సీడ్ జెర్మినేషన్ ప్రోటోకాల్ కు పేటెంట్ పొందేందుకై ప్రతిపాదనలు పంపామని ములుగు అటవీ కళాశాల డీన్ వీ. కృష్ణ వెల్లడించారు. అటవీ ఆధారిత పరిశ్రమలు, సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే పొనికి వృక్ష జాతి పునరుద్దరణకు అటవీ కళాశాల పరిశోధకులు చేపట్టిన ఈ సీడ్ జెర్మినేషన్ విజయవంతం కావడం ఒక చారిత్రక అంశమని అన్నారు.

దీని ద్వారా, పెద్ద ఎత్తున పొనికి చెట్ల పెంపకం చేపట్టడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, హస్తకళల ఆధారిత ఆర్థిక పురోగతికి ఈ పరిశోధన దోహదపడుతుందని అన్నారు. నిర్మల్ హస్తకళల అభివృద్ధికి గాను ఈ పొనికి మొక్కల పెంపకానికి విత్తనాలను అటవీ శాఖకు అందజేయడం ద్వారా అంతరించి పోతున్న పొనికి చెట్ల అభివృద్ధికి తద్వారా నిర్మల్ హస్తకళల పరిశ్రమకు ములుగు అటవీ కళాశాల, రీసర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త మార్గం చూపిస్తోందని అన్నారు.

Next Story