- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ స్కూళ్లలో అసమానతల నివారణ.. టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా అవసరాలను విశ్లేషించి ఉపాధ్యాయులను జిల్లా పరిధిలోనే సర్దుబాటు చేయడానికి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా అవసరాలను విశ్లేషించి ఉపాధ్యాయులను జిల్లా పరిధిలోనే సర్దుబాటు చేయడానికి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీచేశారు. సర్దుబాట్లు పూర్తిగా తాత్కాలికమైనవేనని, బదిలీలుగా పరిగణించబోరని పేర్కొన్నారు. టీచర్ల జీతాలు వారి పాత స్టేషన్ నుండే చెల్లిస్తారని స్పష్టంచేశారు. సర్దుబాటు చేసిన టీచర్లు జూన్ 13లోగా కొత్త పాఠశాలలో రిపోర్టు చేసి విధులను ప్రారంభించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలను జూన్ 30లోగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సమర్పించాలని తెలిపారు. మిగులు టీచర్లను గుర్తించేటప్పుడు సీనియారిటీని గుర్తించాలని సూచించారు. గిరిజన ప్రాంత టీచర్లను సాధారణ ప్రాంతాలకు సర్దుబాటు చేయొద్దని సూచించారు.
టీచర్, విద్యార్థుల నిష్పతి ఇలా..
ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:17గా ఉన్నప్పటికీ, పాఠశాలల వారీగా చూస్తే అసమానతలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రమాణాలను అనుసరించాలని ఆదేశించారు. 1. ప్రాథమిక లేదా అప్పర్ ప్రైమరీ విభాగాల్లో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు, 61 నుంచి 90 మంది విద్యార్థులకు ముగ్గురు, 91 నుంచి120 మంది విద్యార్థులకు నలుగురు, 121 నుంచి 150 మంది విద్యార్థులకు ఐదుగురు, 151 నుంచి 200 మంది విద్యార్థులకు ఆరుగురు, 200 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని సూచించారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో (6వ, 7వ, 8వ తరగతులు) 1 నుంచి 20 మంది విద్యార్థులకు ఇద్దరు సబ్జెక్టు టీచర్లు అందులో ఒకరు లాంగ్వేజ్, మరొకరు నాన్ లాంగ్వేజ్ టీచర్లు ఉండాలి. 21 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు నలుగురు సబ్జెక్టు టీచర్లు ఉండాలని తెలిపారు.
సర్దుబాటు ఇలా..
సర్దుబాటులో టీచర్లను అదే పంచాయతీలోని అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేయాలి. ఒకే ప్రాంగణంలో రెండు పాఠశాలలు ఉన్నట్లయితే, వాటిని ఒకే యూనిట్‌గా పరిగణించి అవసరాలకు అనుగుణంగా నియమించాలి. అదే గ్రామపంచాయతీలో అవసరం లేకపోతే, అదే మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని స్కూళ్లకు పంపించాలి. స్కూల్ కాంప్లెక్స్‌లో అవసరం లేకపోతే అదే మండలంలోని సమీప స్కూల్ కాంప్లెక్స్‌లకు వేయాలి. ఇక్కడ అవసరం లేకపోతే సమీప మండలాలకు సర్దుబాటు చేయాలి. ఇక్కడ అవసరం లేకపోతే, జిల్లాలోని ఇతర మండలాలకు సర్దుబాటు చేయాలి.






