దళపతి విజయ్ కులం ఏంటి?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ హడావిడి?

by Gantepaka Srikanth |

తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, దళపతి విజయ్ కులం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దళపతి విజయ్ కులం ఏంటి?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ హడావిడి?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, దళపతి విజయ్ కులం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ 'దళిత సామాజిక వర్గానికి' చెందినవారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో, అసలు ఆయన నేపథ్యం ఏంటనే విషయంపై నెటిజన్లు తెగ గాలించేస్తున్నారు.

సర్టిఫికెట్లలో 'నో క్యాస్ట్'..

చాలామంది రాజకీయ నాయకులు తమ కుల సమీకరణాలతో ఓట్లు దండుకోవాలని చూస్తుంటే, విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచారు. తన విద్యా సంబంధిత సర్టిఫికెట్లలో ఎక్కడా ఆయన కులం పేరును ప్రస్తావించలేదు. చిన్నతనం నుంచే ఆయన తన సర్టిఫికెట్లలో 'నో క్యాస్ట్' (No Caste) అని నమోదు చేయించుకోవడం విశేషం. కులమతాలకు అతీతంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు.

విజయ్ కుటుంబ నేపథ్యం..

విజయ్ తలిదండ్రులు వేర్వేరు మతాలకు, వర్గాలకు చెందిన వారు. తల్లి శోభ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ క్రైస్తవ మతస్థుడు. తమిళనాడులోని రామేశ్వర తీర ప్రాంతానికి చెందిన సంపన్న భూస్వామ్య కుటుంబం వీరిది. విజయ్ తండ్రి కుటుంబం రోమన్ క్యాథలిక్ క్రైస్తవాన్ని ఆచరిస్తోంది. విజయ్ కూడా తండ్రి మతాన్నే స్వీకరించారు. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ఎందుకు?

విజయ్ తన పార్టీ సిద్ధాంతాల్లో బీఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల ఆశయాలను చేర్చడం, సామాజిక న్యాయం గురించి మాట్లాడటంతో.. ఆయన దళిత వర్గానికి చెందినవారేమోనన్న అపోహ తెలుగు రాష్ట్రాల్లో కొందరిలో కలిగింది. అయితే, సాంకేతికంగా ఆయన వెల్లాలర్ (OC) సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ, వ్యక్తిగతంగా ఏ కులానికి కట్టుబడకుండా 'భారతీయుడు' అనే గుర్తింపుతోనే ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందే కులాల గోడలను బద్ధలు కొట్టిన విజయ్, భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తారో చూడాలి.

Next Story