పొగొట్టుకున్న బస్ పాస్‌కు డూప్లికేట్ ప్రింట్ ఇవ్వాలి: ఆర్టీసీ, మంత్రికి నెటిజన్ విజ్ఞప్తి

by Ramesh Naini |

పొగొట్టుకున్న బస్ పాస్‌కు కొత్త పాస్ తీసుకోవాల్సిందేననే నిబంధనను పునఃపరిశీలించాలని ఓ నెటిజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టసీ), మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.

పొగొట్టుకున్న బస్ పాస్‌కు డూప్లికేట్ ప్రింట్ ఇవ్వాలి: ఆర్టీసీ, మంత్రికి నెటిజన్ విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొగొట్టుకున్న బస్‌పాస్‌కు కొత్త పాస్ తీసుకోవాల్సిందేననే నిబంధనను పునఃపరిశీలించాలని ఓ నెటిజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టసీ), మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. మిగిలిన వ్యాలిడిటీ ఉన్న పాస్‌కు డూప్లికేట్ ప్రింట్ ఇచ్చే విధానం తీసుకురావాలని కోరారు. ఆదివారం ఎక్స్ వేదికగా @jpjourno9 అనే యూజర్ ఈ విషయంపై స్పందిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల హైదరాబాద్ సిటీ బస్సులకు సంబంధించిన మెట్రో డీలక్స్ బస్ పాస్‌ను తాను పొగొట్టుకున్నట్లు తెలిపారు. ఆ పాస్‌కు ఇంకా 15 రోజుల వ్యాలిడిటీ ఉన్నప్పటికీ, బస్ పాస్ కౌంటర్‌కు వెళ్లి వివరాలు చూపించినా డూప్లికేట్ ప్రింట్ ఇవ్వలేమని, తప్పనిసరిగా కొత్త పాస్ తీసుకోవాల్సిందేనని సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో మరో రూ.1850 వెచ్చించి కొత్త పాస్ తీసుకున్నానని వెల్లడించారు.

అయితే కొత్త పాస్ తీసుకునే సమయంలో కస్టమర్ మొబైల్ నంబర్‌కు పాస్‌ను లింక్ చేయడం, రిన్యూవల్‌కు నాలుగు రోజుల ముందే అలర్ట్‌లు పంపడం జరుగుతుండటాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్టీసీ వద్ద ఇప్పటికే ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిలో బస్ పాస్ పోయినప్పుడు కొంత ఛార్జీ వసూలు చేసి పాత పాస్‌కు డూప్లికేట్ ప్రింట్ ఇచ్చే విధానం అమలు చేస్తే, ఇంకా గడువు ఉన్న పాస్‌దారులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనంగా ఉంటుందని సూచించారు. ఈ అంశాన్ని ఆర్టీసీ సంస్థతో పాటు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్వీట్ ఇదే..

Next Story