తెలంగాణ క్రికెట్‌లో ‘నెపోటిజం’.. హెచ్‌సీఏ, బీసీసీఐలకు వరంగల్ న్యాయస్థానం నోటీసులు

by Prasad Jukanti |

తెలంగాణ క్రికెట్‌లో బంధుప్రీతి, పక్షపాతంపై హనుమకొండ కోర్టు HCA, BCCIలకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ క్రికెట్‌లో ‘నెపోటిజం’.. హెచ్‌సీఏ, బీసీసీఐలకు వరంగల్ న్యాయస్థానం నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ క్రికెట్‍లో చాలా కాలంగా చర్చనీయాశంగా మారిన పక్షపాతం, నెపొటిజం (బంధుప్రీతి), జిల్లా ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా హనుమకొండకు చెందిన యువ క్రికెటర్లు మరింగంటి నవరసన్, విష్ణు దాస్ శశాంక్ కశ్యప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హనుమకొండ 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో పాటు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో మూడు వారాల్లో సమగ్ర సమాధానంతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు జారీ చేసిన నోటీసులలో కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది.

కొందరి చేతుల్లోనే గుత్తాధిపత్యం: టీసీఏ

కోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ప్రతినిధులు స్పందించారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ క్రికెట్‌ను కొందరి కుటుంబాలు, వర్గాలు గుత్తాధిపత్యంగా మార్చేశారని, వేలాది జిల్లా క్రికెటర్ల కలలు ఛిద్రమయ్యాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు న్యాయస్థానాలే ఆశాకిరణంగా మారాయాని TCA ప్రతినిధులు పేర్కొన్నారు. “నెపోటిజం నశించాలి… ప్రతిభకు మాత్రమే న్యాయం జరగాలి” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని టీసీఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు వెలుగులోకి రాబోతున్నాయనేది తెలంగాణ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Next Story