- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం.. రెండు నెలలుగా జీపీవోకు అందని జీతాలు
గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా.. వేతనాలు అందక జీపీవోలు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా.. వేతనాలు అందక జీపీవోలు ఇబ్బందులు పడుతున్నారు. హామీ ఇచ్చిన మేరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలను జీపీఓలుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ ఐదోతేదీన 5,106 మందికి నియామక పత్రాలను అందజేసి ఆయా జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చింది. అయితే శాఖల మధ్య సమన్వయలోపంతో వీరి వేతనాల ఫైల్ పెండింగులో పడినట్లు తెలుస్తున్నది. జీపీవోలకు వేతనాలు ఇవ్వడంప్రభుత్వంపై అదనపు ఆర్థికభారమేమీ కాదు. ఆయా శాఖల్లో తీసుకునే వేతనాన్ని రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారు. దీనికి చేయాల్సిన కరస్పాండెంట్ బాధ్యత ఐఏఎస్ అధికారులదే. అయితే సీసీఎల్ఏ నుంచి జిల్లాల వారీగా పూర్తి వివరాలను ఫైనాన్స్ కి పంపినట్లు అధికారులు అంటున్నారు. ఫైనాన్స్ అప్రూవల్ కోసం రెవెన్యూ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ఫైల్ సర్క్యూలేట్ అయ్యింది. కేవలం అధికారులు చూసి తీసుకోవాల్సిన నిర్ణయమే. కానీ ఏ కారణంతో ఏమో గానీ ఇప్పటి వరకు వాళ్లకు వేతనాలు రాలేదు దీంతో జీపీవోలు ఇబ్బందులు పడుతున్నారు. నియామక ఉత్తర్వులు అందించినప్పుడే వాళ్లు పని చేస్తున్న శాఖ నుంచి రెవెన్యూకు పూర్తి సమాచారం అందింది. అలాంటప్పుడు ఏ అడ్డంకులు లేకపోయినా.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని జీపీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్యాడర్ స్ట్రెంత్ ఖరారు
రాష్ట్ర వ్యాప్తంగా జీపీవోల క్యాడర్ స్ట్రెంత్ ను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తామంతా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియాయకపు ఉత్తర్వులు అందుకోవడం ద్వారానే వివిధ శాఖల నుంచి మండల తహశీల్దార్ కార్యాలయాల్లో జీపీవోలుగా పని చేస్తున్నామని ఉద్యోగులు అంటున్నారు. దీనికి సంబంధించిన అన్ని జీవోలు, సర్క్యులర్లు ఉన్నాయి. సీసీఎల్ఏ రెఫరెన్స్ లు, కరస్పాండెన్స్ లెటర్లు ఉన్నాయి. తాము ఏయే శాఖల నుంచి జీపీవోలుగా వచ్చామో కూడా వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. జస్ట్ ఆయా శాఖల నుంచి ఆర్థిక సర్దుబాటు చేయడం ద్వారా వేతనాలు చెల్లించడం పెద్ద కష్టమైన పని కాదు. తమకు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసు అకౌంట్ నుంచి వేతనాలు ఇప్పించాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన వేతనాన్ని ఇప్పించాలని కోరారు.






