- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం.. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గాయబ్
హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి పోగొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఎంత వెతికినా తాళం దొరక్కపోవడంతో, చివరకు పోలీసులు దానిని పగులగొట్టి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయం ఉత్కంఠగా ప్రారంభమైంది. అయితే, హుజూరాబాద్‌లో మాత్రం ఎన్నికల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి కనిపించకుండా పోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు స్ట్రాంగ్ రూమ్ తెరవాల్సి ఉంటుంది. అయితే, గదికి వేసిన తాళం తీసేందుకు సిద్ధమైన సిబ్బందికి ఒక్కసారిగా షాక్ తగిలింది. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి తమ వద్ద లేదని, అది ఎక్కడో పోయిందని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కౌంటింగ్ సమయం మించిపోతుండటం, అభ్యర్థులు, ఏజెంట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరకు పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగులగొట్టారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను వెలికితీసి కౌంటింగ్ హాల్‌కు తరలించారు.
యథావిధిగా కౌంటింగ్..
ఈ అంతరాయం తర్వాత కాసేపటి క్రితమే హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిధిగా ప్రారంభమైంది. అత్యంత కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళాల విషయంలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






