హైకోర్టు తీర్పుతో షాక్.. తెలంగాణ సర్కార్‌కు గడ్డు కాలం తప్పదా?

by Disha Web Desk 2 |
హైకోర్టు తీర్పుతో షాక్.. తెలంగాణ సర్కార్‌కు గడ్డు కాలం తప్పదా?
X

దిశ,తెలంగాణ బ్యూరో: మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మున్ముందు రాష్ట్ర సర్కార్‌కు గడ్డుకాలమే కానుంది. స్టేట్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టేసి, పొరుగు రాష్ట్రాల ఆఫీసర్లకు సర్కార్ పట్టం కట్టింది. వారికే కీలకమైన శాఖలు కట్టబెట్టింది. ఇంతకాలం కీలక హోదాలో పని చేసిన ఏపీ క్యాడర్ ఆఫీసర్లను తమ సొంత రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో తెలంగాణ కేడర్‌‌లో చాలా మంది ఆఫీసర్లు ఉన్నా ప్రయోజనం లేదనే అభిప్రాయాలు తలెత్తాయి. ఎందుకంటే వారిని ఇంతకాలం లూప్ లైన్‌లో పడేయడంతో పనిచేసే అనుభవం లేకుండా పోయిందనేది ప్రస్తుతం చర్చకు వచ్చింది.

హైకోర్టు తీర్పుతో షాక్

డిసెంబర్ 31న డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్లేస్‌లో అంజనీకుమార్‌‌ను ఇన్‌చార్జి డీజీపీగా సర్కార్ నియమించింది. ఆయననూ పూర్తి స్థాయి డీజీపీగా చేసేందుకు యూపీఎస్సీ ఎన్ ప్యానల్‌కు జాబితా పంపేందుకు కసరత్తు చేసింది. ఈలోపే హైకోర్టు తీర్పు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఇన్నాళ్లూ.. ఏపీ క్యాడర్ ఆఫీసర్లకు కీలక బాధ్యతలు అప్పగించి తప్పు చేశామా..! అని ప్రగతిభవన్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఇంతకాలం సొంత కేడర్ ఆఫీసర్లకు కీలకమైన శాఖలు ఇవ్వలేదు. ప్రస్తుతం వారికి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది? వారు క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు? సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటారు? అని సర్కార్ తల పట్టుకున్నట్టు సమాచారం.

కీలక పోస్టుల్లోనూ..

ఏపీ కేడర్‌ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడ పలు కీలక పోస్టుల్లో ఉన్నారు. వారిలో అంజనీ కుమార్‌ను డీజీపీగా కొద్ది రోజుల కిందటే నియమించారు. వాకాటి కరుణ ఎడ్యుకేషన్ సెక్రటరీగా, రోనాల్డ్ రోస్ ఫైనాన్స్ సెక్రటరీ, వాణిప్రసాద్ ఈపీటీఆర్ఐ డీజీ, అమ్రపాలి సెంట్రల్ సర్వీసులో ఉండగా, ప్రశాంతి ఫారెస్ట్ సెక్రటరీగా ఉన్నారు. ఈమధ్యే పోలీసు శాఖలో ఏపీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష్ బిస్త్‌కు పోస్టింగ్ ఇచ్చారు. వీరిని ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వస్తాయని తెలిసింది.

ఆరా తీసే పనిలో కేంద్రం

ఇంతకాలం ఆలిండియా సర్వీస్ అధికారులపై ఊదాసీనంగా వ్యవహరించిన కేంద్రం ఇక నుంచి కఠినంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు, రూల్స్ ఉల్లంఘించే వారిపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణలోని ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల వ్యవహార తీరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వారికి కేటాయించిన రాష్ట్రంలో కాకుండా తమకు ఇష్టమైన చోట పనిచేసే అవకాశం లేదనే సంకేతాలను పంపేందుకు రెడీ అయ్యింది. ఇప్పటి వరకూ రూల్స్‌కు విరుద్ధంగా పనిచేసిన ఆఫీసర్లు ఏ శాఖలో పని చేశారు? ఎక్కడ ఏం చేశారు? వారిపై వచ్చిన ఆరోపణలు ఏంటీ? అనే అంశాలపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.


Next Story