NEET-PG: నీట్-పీజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల.. వివరాలు ఇవే

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా నీట్ పీజీ-2025 అడ్మిషన్లకు సంబంధించిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ), స్టేట్ కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది.

NEET-PG: నీట్-పీజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల.. వివరాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా నీట్ పీజీ-2025 అడ్మిషన్లకు సంబంధించిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ), స్టేట్ కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ను అన్ని రాష్ట్ర వైద్య విద్య శాఖలు, కౌన్సెలింగ్ సంస్థలు, మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని ఎన్ఎంసీ ఆదేశించింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసిన షెడ్యూల్‌ను ఏ రాష్ట్రం కూడా మార్చకూడదని కోరింది. అలా చేస్తే ఏఐక్యూ-స్టేట్ కౌన్సెలింగ్‌ల మధ్య సమన్వయ లోపం వల్ల విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఎన్ఎంసీ స్పష్టం చేసింది. కాగా... తెలంగాణలో నీట్-పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం అయిన నేపథ్యంలో ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులకు రిపోర్టింగ్ గడువును కాళోజీ యూనివర్సిటీ పొడిగించిన సంగతి తెలిసిందే. చివరి తేదీని ఈ నెల 18 నుంచి ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ స్పష్టం చేసింది.

అన్ని సెలవులు కూడా వర్కింగ్ డేస్‌గానే...

కౌన్సెలింగ్ సమయం తక్కువగా ఉన్నందున శనివారాలు, ఆదివారాలు, గెజిటెడ్ సెలవులు కూడా వర్కింగ్ డేస్‌గా పరిగణించి కౌన్సెలింగ్ పనులు కొనసాగించాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. రాష్టాలు- ఎంసీసీతో డేటా పంచుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. ఏఐక్యూ, స్టేట్ కౌన్సెలింగ్‌లలో ఒకే సీటుపై డబుల్ అలాట్‌మెంట్ కాకుండా ఉండేందుకు, రాష్ట్రాల డీఎంఈలు జాయిన్ అయిన విద్యార్థుల డేటాను ఎంసీసీకి రౌండ్ల వారీగా సమర్పించాలని ఎన్ఎంసీ కోరింది. సంబంధిత కాలేజీలు, అధికారులు, విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించింది.

ఎన్ఎంసీ విడుదల చేసిన కౌన్సెలింగ్ కీలక తేదీలు:

  • 1 వ దశ కౌన్సెలింగ్: అక్టోబర్ 17- నవంబర్ 22, 2025
  • 1వ దశ జాయినింగ్ చివరి తేదీ: డిసెంబర్ 1, 2025
  • 2వ రౌండ్ కౌన్సెలింగ్: డిసెంబర్ 5- డిసెంబర్ 12, 2025
  • 3వ రౌండ్: డిసెంబర్ 26, 2025 - జనవరి 2, 2026
  • స్ట్రే వెకెన్సీ రౌండ్: జనవరి 15 - జనవరి 21, 2026
  • అన్ని రౌండ్ల జాయినింగ్ చివరి తేదీ: జనవరి 31, 2026
  • డిసెంబర్ 22, 2025 నుంచి అకాడెమిక్ సెషన్ ప్రారంభం
Next Story