లాభాల బాటలోకి నార్ముల్ మదర్ డెయిరీ : మంత్రి వాకిటి శ్రీహరి

by Naga Rani Yarlagadda |

నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం నార్ముల్ మదర్ డెయిరీ అభివృద్ధి కోసం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు తో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.

లాభాల బాటలోకి నార్ముల్ మదర్ డెయిరీ : మంత్రి వాకిటి శ్రీహరి
X
  • మదర్ డెయిరీ అభివృద్ధికి ఎన్‌డీడీబీతో ఒప్పందం
  • 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు
  • పాడి రైతుల బకాయిల కోసం తక్షణమే రూ.10 కోట్ల విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో : నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం నార్ముల్ మదర్ డెయిరీ అభివృద్ధి కోసం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే 15 ఏళ్ల పాటు మదర్ డెయిరీని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్‌డీడీబీ తీసుకోనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాడి రైతుల సమస్యలకు ఈ ఒప్పందంతో పరిష్కారం లభించనుంది. సంస్థను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రాథమిక దశలో పాడి రైతులకు చెల్లించాల్సిన పాత బకాయిల కోసం ఎన్‌డీడీబీ తక్షణమే 10 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఈ నిధులతో రైతులకు ఉపశమనం లభించడమే కాకుండా, డెయిరీ కార్యకలాపాల్లో వేగం పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ విభాగం అధికారులు, ఎన్‌డీడీబీ ప్రతినిధులు ఈ కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మదర్ డెయిరీని లాభాల బాటలోకి మళ్లించి, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు అండగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎన్‌డీడీబీ వంటి జాతీయ స్థాయి సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వల్ల మదర్ డెయిరీలో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, తద్వారా పాల సేకరణ, మార్కెటింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ఉమ్మడి జిల్లాల పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ శాఖల సెక్రటరీ ఇలంబర్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎన్‌డీడీబీ ఉన్నతాధికారులు, రాష్ట్ర డైయిరీ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story