తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నారాయణపేట్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు ఖరారు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ.. పేద ప్రజలకు అంకిత భావంతో సేవలో అందించడమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నారాయణపేట్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు ఖరారు
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ.. పేద ప్రజలకు అంకిత భావంతో సేవలో అందించడమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తి అత్యంత ప్రధానమైనది.. ఈ అవకాశం అందరికీ రాదు.. కొందరికే వస్తుంది.. ఈ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. గొప్ప స్థాయికి ఎదిగి జన్మకు సార్థకత చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ఎంతో కృషి చేశారు.

ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మెడికల్ కళాశాలకు చిట్టెం నర్సిరెడ్డి కళాశాల అనే పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చర్చించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా బూర్గుల రామకృష్ణారావు అనంతరం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, శ్రీహరి, వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story