- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలసీమియా రహిత సమాజమే లక్ష్యం: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భారీ రన్
చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న భయంకరమైన తలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో భారీ 'తలసీమియా రన్' నిర్వహించింది.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న భయంకరమైన తలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో భారీ 'తలసీమియా రన్' నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి 10కె, 5కె, 3కె పరుగులను ప్రారంభించారు.
రక్తదానం బాధ్యతగా తీసుకోవాలి
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. తలసీమియా బాధితుల దీనస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. "దేశంలో ఏటా సుమారు 12 వేల మంది చిన్నారులు తలసీమియాతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి రక్తమార్పిడి ఒక్కటే జీవనాధారం. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు, పైగా అది మరొకరికి పునర్జన్మ నిస్తుంది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలి" అని పిలుపునిచ్చారు.
వివాహానికి ముందు పరీక్షలు తప్పనిసరి
వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ.. యువత వివాహానికి ముందే తప్పనిసరిగా స్క్రీనింగ్ (రక్త పరీక్షలు) చేయించుకోవాలని ఆమె సూచించారు. దీనివల్ల రాబోయే తరాలకు తలసీమియా సోకకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే క్రమంలో త్వరలోనే విజయవాడ, అనంతపురం జిల్లాల్లో ప్రత్యేక తలసీమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్, ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొని క్రీడాకారులను, యువతను ఉత్సాహపరిచారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది యువతీ యువకులు, క్రీడాకారులు ఈ పరుగులో పాల్గొని తలసీమియా రహిత సమాజం కోసం నినదించారు.






