- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్లసాగర్ ప్రాజెక్టును ఎలాగైనా ఆపాలి : సీఎం రేవంత్ రెడ్డి
గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది.

దిశ, వెబ్ డెస్క్ : గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో ముంబైలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా న్యాయ నిపుణులకు సీఎం సూచించారు. అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.
అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఆ పిటిషన్‌లో స్పష్టం చేసింది.
తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జలసంఘం, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.






