ఎన్ఎటిఎల్ పవర్ ప్లాంట్ నీటిలో వ్యక్తి గల్లంతు

by Bhanu |

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామ శివారులోని వేములేరు వాగుపై నిర్మించిన ఎన్ఎటిఎల్ పవర్ ప్లాంట్‌లో

ఎన్ఎటిఎల్ పవర్ ప్లాంట్ నీటిలో వ్యక్తి గల్లంతు
X

దిశ హుజూర్ నగర్ / మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామ శివారులోని వేములేరు వాగుపై నిర్మించిన ఎన్ఎటిఎల్ పవర్ ప్లాంట్‌లో సోమవారం విషాదం చోటు చేసుకుంది. మరమ్మతుల పనిలో భాగంగా నీటిలో దిగిన ఓ కార్మికుడు గల్లంతయ్యాడు.

నేరేడుచర్ల మండలం పీర్‌సాహెబ్ గూడెం గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ (35) గత ఐదు రోజులుగా ఎన్ఎటిఎల్ ప్లాంట్‌లో పనిలో ఉన్నాడు. పవర్ ప్లాంట్‌లోని మూడు క్రషర్ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ గేట్‌ను పైకి లేపేందుకు నీటిలోకి దిగిన ఉస్మాన్, క్రషర్ గేటు కింద ఉన్న లాక్‌కు తాడు కట్టే ప్రయత్నంలో ఉండగా, నీటి వేగం అధికంగా ఉండటంతో గేటులో ఇరుక్కుపోయినట్లు ప్రత్యక్షదారులు తెలిపారు. తాడు బయటకు లాగగా అది ఖాళీగా రావడం చూసి, ఉస్మాన్ ప్రమాదంలో ఉన్నాడని అక్కడే ఉన్నవారు గుర్తించారు.

వెంటనే ప్రయత్నాలు చేసినా నీటి ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు విఫలమైంది. సమాచారం అందుకున్న హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్సై బాబు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. భారీ నీటి ఒత్తిడి కారణంగా నాగార్జునసాగర్‌ రిస్క్ రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దింపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

రాత్రి సమయానికి గాలింపు కొనసాగుతున్నా ఉస్మాన్ కనిపించలేదు. తెల్లవారుజామున ప్రత్యేక బృందాలతో అతడి మృతదేహాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఘటన విషయమై తెలుసుకున్న ఉస్మాన్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్లాంట్ వద్దకు చేరుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఎప్పుడు బయటకి తీస్తారు?” అంటూ ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.

Next Story