- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైదన్నా ఏందన్నా.. ఈ దోపిడీ.. !
హిందూ ముస్లింలు పవిత్రంగా భక్తి శ్రద్ధలతో కలిసి నిర్వహించుకునే సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా భక్తులు శుక్రవారం ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా వచ్చి ఇక్కడకు వచ్చి కందూరు చేసి మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు.

దిశ హుజూర్ నగర్ (పాలకవీడు): హిందూ ముస్లింలు పవిత్రంగా భక్తి శ్రద్ధలతో కలిసి నిర్వహించుకునే సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా భక్తులు శుక్రవారం ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా వచ్చి ఇక్కడకు వచ్చి కందూరు చేసి మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలను వక్ఫ్ బోర్డ్ జనవరి చివరి వారంలో జరగనున్నాయి. అలాంటి దర్గాపై కొందరు అనధికార వ్యక్తులు పెత్తనం చేస్తూ వచ్చిన భక్తుల నుండి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో నడవాల్సిన మైంటెన్స్ అనధికార వ్యక్తులు నిర్వహించడం ఏందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారి దృష్టి సారించి ఇక్కడ దోపిడీని నివారించాలని భక్తులు కోరుతున్నారు.
ఒక కందూరుకు రూ.2,000 పైన ఖర్చు..
వివిధ ప్రాంతాల నుండి తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఇక్కడికి వచ్చి కందూరు నిర్వహిస్తారు. కందూరులో భాగంగా మేకపోతులను, పొట్టేలను, కోళ్లను కోసి వాటి ఫాతేహ దర్గాలోని సైదులు బాబాను దర్శించుకొని సమర్పిస్తారు. ఇలా ఒక కందూరు చేయాలంటే ఒక భక్తులకి ఒక మేకపోతుకు కానీ గొర్రెపోతు గాని మెడ కోసినందుకు రూ.700 నుంచి రూ.800 వరకు తీసుకుంటారు. అలాగే ఫాతేహాలు ఇచ్చే సమయంలో భక్తులు ఎన్ని యాటలు కోస్తే అన్ని వాటికి ఒక్కొక్క దానికి రూ.800 నుంచి రూ.1000 వరకు అక్కడ ఉన్న వారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొందరు స్తోమత లేని వాళ్ళు కోడిని కోసుకొని తమ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు. కానీ వారు కూడా ఫాతేహాలు సమర్పించాలంటే వెయ్యి రూపాయలు ఇయ్యాల్సిందే.. కోడి ఖర్చు కన్నా ఫాతేహాలకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని భక్తులు వాపోతున్నారు. ఇక్కడ రేట్లకు నియంత్రణేదీ లేదు. ఏది కొనాలన్నా విపరీతమైన రేట్లు ఉంటాయి. అడిగే వారు కూడా లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. దీంతోపాటు కొబ్బరికాయలు కూడా అధిక రేట్లకు అమ్ముతున్నారని అలాగే లడ్లు కూడా క్వాలిటీ లేకుండా అమ్ముతున్నారని చర్చ జరుగుతుంది.
అనధికార వ్యక్తుల చేతుల్లో దర్గా..
గతంలో జాన్ పహాడ్ దర్గా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంటే దానిని టెండర్ పద్ధతి ద్వారా ఆ టెండర్ దక్కించుకున్న వారికి సంవత్సరం పాటు వారికి 17 వస్తులకు సంబంధించి అమ్ముకునే హక్కు వక్ఫ్ బోర్డ్ కల్పించేది. అయితే పాలకవీడుకు చెందిన ముజావర్లు దర్గా తమకు సంబంధించిందని అందులో తమకు హక్కు కల్పించాలని కాంటాక్ట్ పద్ధతి వదిలేసి సర్వ హక్కులు తమకే కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. టెండర్ ప్రకటన ద్వారా కాంట్రాక్టర్లకు ఇవ్వవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న ఈ దర్గా కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో వారానికి రెండు లక్షలు చొప్పున వక్ఫ్ బోర్డ్ అధికారులతో మాట్లాడుకుని ఇల్లీగల్ పద్ధతి ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
రేట్లు నియంత్రించేలా బోర్డులు పెట్టాలి..
జాన్ పహాడ్ దర్గా వద్ద వచ్చే భక్తులను ఇక్కడ కాంట్రాక్టర్ దోచుకుంటున్నారని.. దీనికి నియంత్రణ లేదని.. దేనికెంత తీసుకోవాలో అధికారులు ధరల నియంత్రణ బోర్డు పెట్టాలని ఇక్కడికి వచ్చిన భక్తులు గతంలో పనిచేసిన కలెక్టర్ల వద్దకు వెళ్లి కొందరు మరికొందరు గ్రీవెన్స్‌లో కూడా ఫిర్యాదు చేసి ఇక్కడ పరిస్థితి వివరించి చెప్పారు. కానీ అధికారులు కిందిస్థాయి అధికారులకు చెబుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం.. లేక కాంట్రాక్టర్లు వక్ఫ్ బోర్డ్ అధికారులు సహకరించకపోవడంతోనో.. ధరల నియంత్రణ బోర్డు పెట్టడం వెనుక కొంత జాప్యం జరుగుతుందని తెలుస్తుంది.
ఇలా ఉంటే భక్తుల రాక తగ్గుతుంది: షేక్.జహంగీర్ జాన్ పహాడ్ దర్గా భక్తుడు.
ప్రతి సంవత్సరం జాన్‌పహాడ్ వచ్చి కందూరు చేయడం లేదా.. దర్శించుకుని వెళ్తుంటాము. ఇక్కడ భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ కాంట్రాక్టర్లు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక కందూరు చేస్తే వీళ్ళకి ఇచ్చే ఖర్చు రూ.3000 వరకు వస్తుంది. వీళ్ళ నియంత్రణ తగ్గించాలి. లేకుంటే భవిష్యత్తులో దర్గాకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గేటట్లు ఉంది. అధికారులు దృష్టి సారించి దోపిడీని అరికట్టండి.
వక్ఫ్ బోర్డ్ అధికారులు నిర్ణయం మేరకు ఇచ్చాం: వక్ఫ్ బోర్డ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్స్‌పెక్టర్ షేక్ మహమ్మద్
ప్రస్తుతం టెండర్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి లేకపోవడంతో వక్ఫ్ బోర్డ్ కమిటీ అధికారుల నిర్ణయం మేరకు ప్రైవేటు వ్యక్తులకు వారానికి రూ.2 లక్షల చొప్పున మెయింటెన్స్ మొత్తం వారే చూసుకునేలా.. వసూలు కూడా చేసుకునే విధంగా అప్పగించారు. దీనికి అధికారికంగా వారికి అప్పగిస్తున్నట్లు ఎటువంటి లెటర్ ఇవ్వలేదు. ఇందులో 17 వస్తువుల సంబంధించిన అమ్మకాల నిర్ణయ ధరలను నిర్ణయించి తీసుకుంటున్నారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. వక్ఫ్ బోర్డ్ అధికారులు చెప్పిన విధంగా పనిచేస్తున్నా. ఈనెల 22 ,23 ,24 తేదీలలో ఉర్సు ఉంది. దానికి సంబంధించి ఎలా నిర్వహించాలో అన్ని శాఖల అధికారులు సమావేశమై నిర్ణయిస్తాం.






