తెలంగాణ పర్యాటకులు చేసిన పాపం ఏంటి

by Sridhar Babu |

నాగార్జునసాగర్ నుండి నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను శనివారం నుండి నిలిపివేశారు.

తెలంగాణ పర్యాటకులు చేసిన పాపం ఏంటి
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నుండి నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను శనివారం నుండి నిలిపివేశారు. దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేక ఒకవైపు, కనీసం జాలీ ట్రిప్పులో సాగర్ జలాశయంలో వివరించే అవకాశం లేక మరోవైపు నిరాశకు గురయ్యారు. నాగార్జునసాగర్ డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నడంతో శనివారం అధిక సంఖ్యలో సాగర్ ని సందర్శించడానికి పర్యాటకులు వచ్చారు. అయితే శనివారం ఉన్నతాధికారులు టూరిజం లాంచీలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారని స్థానిక బోటింగ్ పాయింట్ అధికారులు లాంచీలను నాగార్జున కొండకు తిప్పకుండా నిలిపివేశారు. సాగర్ డ్యాం జల విన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరిద్దామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. ఎంతసేపటికి తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత టూరిజం అధికారులను తిట్టుకుంటూ నిరాశతో వెనుతిరిగారు.

అయితే నాగార్జునసాగర్ తెలంగాణ వైపు నుండి నాగార్జున కొండకు వెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిడ్ జనరల్ మేనేజర్ ఇబ్రహీంను వివరణ కోరగా నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నతాధికారుల నుండి తమకు తెలంగాణ టూరిజం లాంచీలను తాము చెప్పేంతవరకు తిప్పకూడదని శ్రీశైలం నుండి అధిక మొత్తంలో వరదనీరు వస్తున్న కారణంగా పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీల రాకపోకలను సాగర్ జలాశయంలో నిలిపివేయాలని తెలిపారని ఈ కారణంగానే కొన్ని రోజుల పాటు తెలంగాణ టూరిజం లాంచీలను సాగర్ జలాశయంలో తిరగకుండా నిలిపివేస్తున్నామని తెలిపారు. తెలంగాణ టూరిజం లాంచీలను నిలిపివేసిన కారణంగా లక్షల రూపాయల్లో ఆదాయానికి గండిపడినా పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసిన ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు తమ లాంచీలను యథేచ్ఛగా నాగార్జున కొండకు శనివారం నడిపించడం గమనార్హం. శని,ఆదివారాలతో పాటు వరుసగా సెలవు దినాలు రావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సాగర్​కు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో తెలంగాణ టూరిజం లాంచ్ లను నిలిపివేయడంపై లోగుట్టు ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story