ఆ శాఖలో అసలేం జరుగుతోంది

by Thanuru Gopichand |   (  Updated:2025-12-30 02:05:26  IST  )

ఓ ప్రభుత్వాధికారి పదవి విరమణ పొందిన తరువాత సొంత శాఖ, ఇంచార్జి శాఖలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు.

ఆ శాఖలో అసలేం జరుగుతోంది
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఓ ప్రభుత్వాధికారి తన పదవి విరమణ తర్వాత తను విధులు నిర్వహించిన సొంత శాఖ, ఇంచార్జి వ్యవహారం చూసిన శాఖకు సంబంధించిన వ్యవహారాలలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దు. ఆలా చేస్తే పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. కానీ ప్రస్తుతం నల్లగొండ కలెక్టరేట్లోని ఓ ప్రధాన శాఖకు సంబంధించిన అధికారి పదవి విరమణ పొందిన తన కార్యకలాపాలను తాను గతంలో పని చేసిన డిపార్ట్మెంట్లలో పాలన వ్యవహారాలలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఏకంగా అధికారిక ఫైళ్ల మీద సంతకం కూడా పెడుతున్నారంటే.. జిల్లా యంత్రాంగం పాలన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 9 ఏళ్లకు పైగా ఈ జిల్లాలో ఓ అధికారి ప్రధాన శాఖకు జిల్లా అధికారిక బాధ్యతలు నిర్వహించారు. దాంతోపాటు చాలా డిపార్ట్మెంట్లకు ఇంచార్జి అధికారిగా కూడా పనిచేశారు. అంటే దాదాపు అంత సుదీర్ఘ కాలంపాటు జిల్లాలో ఏ అధికారి కూడా పనిచేసిన సందర్భం లేదు. అధికారి గత నెల చివరి రోజున పదవి విరమణ పొందారు. అధికారికి తన మాతృ సంస్థ అయిన డిపార్ట్మెంట్, ఇప్పటికే ఇంచార్జి అధికారిగా వ్యవహరిస్తున్న మరో డిపార్ట్మెంట్ నుంచి బహుమతులు అందజేసి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

ఏ హోదాలో వేతనాలు ఫైల్ పై సంతకం....?

దాదాపు 30 సంవత్సరాల పైగా పని చేసిన అధికారులు పదవి విరమణ తర్వాత అధికారికంగా జరిగే పాలన వ్యవహారాల ఫైళ్ళపై ఎలాంటి సంతకం చేయకూడదని కనీస పరిజ్ఞానం లేకపోవడమా...లేదా.. పాలన యంత్రాంగం... ప్రభుత్వ పెద్దలు .. తనకు అండగా ఉన్నారని ధీమాతో నా... పదవీ విరమణ పొందిన ఓ అధికారి గతంలో తాను ఇంచార్జి వ్యవహరించిన శాఖకు సంబంధించిన వ్యవహారాలలో అలా మునకలై ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే సుమారు 210 మంది ఉద్యోగుల వేతనాల ఫైల్ పై " బ్లూ పెన్ " తో సంతకం చేసి డిసెంబర్ 24న ట్రెజరీకి పంపించినట్లు సమాచారం. అయితే ఇది గమనించిన ట్రెజరీ అధికారులు ఆ ఫైల్ ను పెండింగ్ పెట్టినట్లు తెలిసింది. అయితే ఇన్చార్జిగా గతంలో పనిచేసిన డిపార్టుమెంటుకు సంబంధించిన ఫైల్ లోనే సంతకం పెడుతుండంటే తన మాతృ సంస్థ అయిన ప్రభుత్వ శాఖలో ఇంకే స్థాయిలో ఫైళ్లు నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే జిల్లా పాలనాధికారికి తెలియకుండా ఈ తతంగం జరుగుతుందనకుంటే పొరపాటే.. ఇలా తెలియక జరిగి ఉంటే ఇప్పటికే ఆ విశ్రాంత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. విశ్రాంత అధికారి ఎలాంటి అధికారిక హోదా లేకుండా ఫైల్ పై సంతకం పెట్టిన విషయం బహిర్గతమై వారం రోజులు గడుస్తున్న ఇంతవరకు చర్యలు లేవంటేనే అర్థమవుతుంది.. ఇదంతా పూర్తిస్థాయిలో ఉన్నతాధికారుల అండదండలతోనే జరుగుతుందని.

ఆ ఫైల్ పక్కకు పెట్టాం.. శ్రీనివాసులు, డిటివో నల్లగొండ

బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది వేతనాల ఫైల్ పై విశ్రాంత అధికారి సంతకం పెట్టిన విషయాన్ని గుర్తించాం. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే,... ఎక్స్టెన్షన్ లెటర్ ఉంది. తీసుకువస్తామని చెప్పారు. అని ఇంతవరకు ఆ లెటర్ ఇవ్వలేదు. అందుకే ఫైల్ పక్కకు పెట్టాం.

Next Story