చేనేత కార్మికులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తా : కోమటిరెడ్డి

by Bhoopathi Nagaiah |

ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత నేతన్నలదేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

చేనేత కార్మికులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తా : కోమటిరెడ్డి
X

దిశ, చండూరు: ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత నేతన్నలదేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మా గ్రామంలో చేనేత కుటుంబాలతో కలిసిమెలిసి జీవించటంతో నా చిన్ననాటి నుండి చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. టెక్నాలజీ పెరిగి మరమగ్గాలు వచ్చిన తర్వాత నేతన్నలకు కష్టాలు పెరిగాయన్నారు. బట్టలు నేస్తున్న నేతన్నల జీవితాలు అంతంతమాత్రంగా ఉంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్నా వాళ్ళ జీవితాలు మాత్రం చాలా బాగున్నాయన్నారు. చేనేత సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసుకొని నేతన్నలను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకపోతానన్నారు. పేదరికంలో ఉండి చేనేత వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానన్నారు. ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

నేతన్నలకు బీమా చెక్కుల పంపిణీ

నేతన్నల బీమా పథకం కింద ఏడుగురు వ్యక్తులకు రూ.35 లక్షల విలువ చేసే చెక్కలు, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు 1 కోటి 10 లక్షల 75 వేల రూపాయల చెక్కులను పంపిణి చేశారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమే అని గుర్తు చేశారు. అంతకు ముందు ఆయన గట్టుప్పల్ మండల పరిధిలోని కమ్మగూడెం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కమ్మగూడెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ గోలి లూర్ధమ్మ నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెరట్ పల్లి గ్రామంలో నిరుపేద మహిళ ఆకుల పద్మ నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, గట్టుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నామని జగన్నాధం, విరమళ్ళ శ్రీశైలం, తహసీల్దార్ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story