నల్లగొండలో జరిగిన హత్యకేసులో ట్విస్ట్.. నిద్రించే చోటుకోసమే దారుణ హత్య

by Nalla Sampath Reddy |

ఎటువంటి పరిచయం లేని వ్యక్తిని, నిద్రించే చోటుకోసం రాళ్లతో కొట్టి ఓ దుండగుడు దారుణంగా హతమార్చాడు. గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 24 గంటల్లోనే టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు.

నల్లగొండలో జరిగిన హత్యకేసులో ట్విస్ట్.. నిద్రించే చోటుకోసమే దారుణ హత్య
X

దిశ, నల్లగొండ క్రైం: ఎటువంటి పరిచయం లేని వ్యక్తిని, నిద్రించే చోటుకోసం రాళ్లతో కొట్టి ఓ దుండగుడు దారుణంగా హతమార్చాడు. గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 24 గంటల్లోనే టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ శివరాంరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలో ఈ నెల 28న ఉదయం 6 గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు, ప్రతిక్ రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్‌ (40) అనే వ్యక్తి బండరాయితో కొట్టి హత్యచేయబడ్డాడు. రమేష్ బావ భూష్పాక వెంకటయ్య ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి, క్లూస్ టీం సిబ్బంది సాయంతో నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ లభించిన సమాచారం, ఆధారాలతో, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లతో నేరస్తుడిని గుర్తించారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు రెహమాన్ బాగ్‌లోని ధమాకా బజార్ దగ్గర నిద్రిస్తున్న నిందితుని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పట్టుకుని విచారించగా, తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సిరాజ్ నెల రోజుల క్రితం ఇతనికి తెలిసిన హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఒక రోజు లోడ్ తీస్కొని నల్గొండ నుంచి పోతున్న సమయంలో డ్రైవర్‌తో గొడవపడగా, డ్రైవర్ లారీ నుండి దింపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నల్గొండ పట్టణంలో ఉంటూ, అన్నపూర్ణ క్యాంటీన్ రూ.5 భోజనం చేస్తూ, చుట్టుపక్కల అడుక్కుంటూ క్యాంటీన్ వద్దే పడుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో ఇతను పడుకునేటటువంటి స్థలంలో ఇతని పట్టాతో నిద్రిస్తున్న చింతకింది రమేష్‌ని, తను రోజు నిద్రించే ప్లేస్‌లో ఎందుకు పడుకున్నావని అడగగా, మృతుడు రమేష్ తాగిన మైకంలో ఈ ప్లేస్ నీ అయ్యదా? నువ్వు ఎవడివి నన్ను అడిగేది అంటూ గొడవకు దిగి చేతితో కొట్టి గొంతు పట్టుకొని చంపుతా అని నెట్టేసి బెదిరించగా, అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

దీంతో తను రెగ్యులర్‌గా పడుకునే స్థలంలో పడుకుని, తననే తిట్టి, కొట్టినందుకు అవమానంగా భావించి కక్ష్య పెంచుకొని ఎలాగైనా అతనిని ఏదో ఒకటి చేయాలని, ఒక గంట తర్వాత మృతుడి వద్దకు వచ్చి, నిద్రిస్తున్నది గమనించి పక్కనే ఉన్న మొలదేలిన ఒక గ్రానైట్ రాయిని తీస్కొని రెండు చేతులతో మృతుడి తలపై బలంగా కొట్టి రాయిని దొరకకుండా కాలేజీ గోడ వెనక విసిరేసి అక్కడ నుండి పారిపోయాడు అని తెలియజేస్తూ, నేరం ఒప్పుకున్నాడు. అతడు నేరానికి ఉపయోగించిన బండ రాయిని స్వాధీనం చేసుకొని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారని డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించి సీరియస్‌గా తీసుకొని డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కేవలం 24 గంటలలోపు చేదించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై వెంకట్ నారాయణ, ఏఎస్ఐ వెంకట్ యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాములు, సైదులును ఎస్పీ అభినందించారు.

Next Story