ప్రభుత్వ పథకం పేరుతో వృద్ధులే టార్గెట్..

by Kodari Anjali |

ప్రభుత్వ ఉచిత పథకాల పేరుతో వృద్ధులను నమ్మించి బంగారు నగలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ పథకం పేరుతో వృద్ధులే టార్గెట్..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ప్రభుత్వ ఉచిత పథకాల పేరుతో వృద్ధులను నమ్మించి బంగారు నగలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం భువనగిరి డీఎస్పీ రవీందర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న జరిగిన చైన్‌ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు మంగళ సూత్రంతో పాటు నేరానికి ఉపయోగించిన పల్సర్ ఎన్ఎస్-200 బైక్, ఐఫోన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన సింహాద్రి గంగాధరప్ప, కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు తాలూకాకు చెందిన జంగాల శివరాజ్ కలిసి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి...

ఈ నెల 12న బీబీనగర్ పట్టణానికి చెందిన కుక్కడువ్వు అండాలు తన భర్తతో కలిసి ఇంట్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. తమను ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ పథకానికి సంబంధించిన అధికారులమని పరిచయం చేసుకుని, ఉచిత బియ్యం పొందేందుకు అర్హతను పరిశీలించాల్సి ఉందని తెలిపారు. అనంతరం వివరాలు నమోదు చేయడానికి ఫొటో తీయాలని చెప్పి, "మెడలో ఉన్న బంగారు గొలుసు ఫొటోకు అడ్డుగా వస్తోంది... దాన్ని తీసేయండి" అంటూ వృద్ధురాలిని నమ్మించారు. ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తీసిన వెంటనే నిందితులు ఆమెను తోసివేసి సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

ఏపీ, కర్ణాటకలోనూ కేసులు...

ఈ ఇద్దరు నిందితులపై గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ, గొరంట్ల, లేపాక్షి పోలీస్ స్టేషన్లతో పరిధిలో కూడా పలు చైన్‌స్నాచింగ్, మోసపూరిత నేరాల కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమావేశంలో బీబీనగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐలు రమేష్, కృష్ణయ్య, కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Next Story