విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి : క‌లెక్ట‌ర్ బడుగు చంద్రశేఖర్

by Ratna Kumari |

పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు.

విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి : క‌లెక్ట‌ర్ బడుగు చంద్రశేఖర్
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న "జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన , ఇన్ స్పైర్ అవార్డ్స్" కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో చక్రము (వీల్), విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వల్ల ఆవిర్భవించాయన్నారు. ఒక అంశంపై పరిశీలన ద్వారా అవగాహన కలుగుతుందని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఆ విధంగా విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రతి అంశాన్ని పరిశీలించాలని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్న రెండు రోజుల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 284 ప్రదర్శనలు ప్రదర్శిస్తుండగా, ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న విద్యార్థులతో పాటు, ఇతర విద్యార్థులు సైతం అన్ని ప్రదర్శనలను బాగా పరిశీలించాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు జాతీయ స్థాయిలో కనీసం 10నుండి 15వరకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ తరగతి గదిలో విన్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఒక మంచి అవకాశం అని అన్నారు. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వైజ్ఞానిక ప్రదర్శన చక్కటి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. జిల్లా విద్యార్థుల ఆవిష్కరణలు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్ వాణి, డీఈఓ బిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

Next Story