చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

by Ratna Kumari |

చదువుతోపాటు యువత క్రీడలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

చదువుతో పాటు క్రీడలకు  ప్రాముఖ్యత ఇవ్వాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
X

దిశ‌, సంస్థాన్ నారాయణపురం : చదువుతోపాటు యువత క్రీడలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలిచిన చిమిర్యాల టీం ఫైటర్స్ కి, రన్నరప్ గా నిలిచిన నారాయణపూర్ మండల కేంద్రంకి చెందిన బీజేఆర్ యూత్ టీంలతో పాటు ఈ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నాణ్యమైన ఆహారం దొరకడం లేదని ఆ ఆహారం తినడం వల్ల అనారోగ్యాల బారిన పడుతూ తొందరగానే మృతి చెందుతున్నారని అన్నారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం క్రీడలు ఆడితే శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని తద్వారా చాలా కాలం జీవించొచ్చని అన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యంగా లేకపోతే దేనికి పనికిరామని, ఆరోగ్యంగా ఉండాలంటే ఒకవైపు వ్యాయామం, క్రీడలాడుతూ నాణ్యమైన ఆహారం తీసుకుంటూ, మరోవైపు మద్యానికి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. మద్యానికి డ్రగ్స్ కు అలవాటైన యువత తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదని మద్యపానానికి డ్రగ్స్ కు బానిసలు కాకుండా సమాజాన్ని చైతన్య చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యాన్ని నియంత్రించడానికి మద్యం షాపుల సమయపాలనలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా యువత సహకరించాలని చేతులు జోడించి చెబుతున్నానన్నారు. నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఆడడానికి త్వరలోనే గ్రౌండ్ ఏర్పాటు చేయి స్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, త‌హ‌శీల్దార్ పి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో కే ప్రమోద్ కుమార్, ఎస్సై జే.జగన్, ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాల్గొన్నారు.

Next Story