- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరిస్తున్న మంత్రి పదవి..ఆ ఇద్దరిలో ఒక్కరికే ?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఊరిస్తున్న మంత్రి పదవి
=ఆ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో
=గిరిజన కోటాలో బాలు నాయక్
=అధిష్టానంపై ధీమాతో రాజగోపాల్ రెడ్డి
దిశ నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి అదృష్టం తలుపు తట్టలేదు. .. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరిగిన ఆ ఇద్దరి ఆశ నెరవేరలేదు. మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గతంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేరళ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మరోసారి సీఎం ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎలాగైనా ఈసారి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆ ఇద్దరు నేతలు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకరు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండో వారు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు తొలగించడంతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. ఈ దఫా మంత్రివర్గ విస్తరణ అయితే కొత్తగా ఐదుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు సీటు గెలిపిస్తే తప్పకుండా ఇస్తామని స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం వెళ్లి మరీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా కోమటిరెడ్డి తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పై, సీఎం రేవంత్ రెడ్డి పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో అవసరమైతే తానే సీఎం అవుతానని ప్రకటించడం.... అసెంబ్లీ సమావేశాలలో సీఎం , మంత్రుల నియోజకవర్గాలకు అధిక నిధులు తీసుకెళ్తున్నారని స్వపక్షంలోనే విపక్ష స్వరాన్ని వినిపించారు. స్వయంగా ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పేర్లు, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్లు చెప్పుతూ నిధులన్నీ ఆ నియోజకవర్గాలకు వెళుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సందర్భం దొరికినప్పుడల్లా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితులలో కోమటిరెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గాలలో లంబాడీ వర్గం అతి ప్రధానమైనంది. అలాంటి వర్గానికి సరైన గుర్తింపు ఇచ్చేందుకు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తుండగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మంత్రి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డి స్వయనా సోదరుడు కావడంతో పరిస్థితి ఆయనకు ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పనిచేస్తుండగా మూడో మంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు పార్టీ , ప్రభుత్వంపై తప్పుడు అభిప్రాయము ఏర్పడుతుందని భావన కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితులలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న లంబాడ సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్ కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆ సామాజిక వర్గాన్ని గుర్తింపు చేసే క్రమంలోనే రేవంత్ రెడ్డి శాసనసభ ప్రొటెం స్పీకర్ గా బాలు నాయక్ ను నియమించిన విషయం తెలిసిందే. గిరిజన లంబాడ సామాజిక వర్గం కోటాలో తప్పకుండా మంత్రి పదవి వరిస్తుందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు , ప్రజలతోపాటు ఆయన అనుచరులు ఖాయంగా భావిస్తున్నారు..






