అమ్మో.. ప్లాస్టిక్ భూతం

by velandi.Saikiran |

అమ్మో.. ప్లాస్టిక్ భూతం
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. ఇది మట్టిలో కలిసిపోదు. నీటిలో కరగదు. అలాగే ఉంచితే మనుషుల ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదు. అలా అని కాల్చితే ఇంకా ప్రమాదం. దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నామంటూ ప్రభుత్వాలు ప్రకటించడం.. ఇదంతా మామూలే అని ప్రజలు వినియోగించడం సర్వసాధారణం అయింది. ఈ నిర్లక్ష్యం కారణంగా ఇటు ప్రజల ఆరోగ్యం.. అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కానీ.. అధికారులు కానీ ఆశించిన స్థాయిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించగలిగారా..? అంటే ఈ ప్రశ్నకు సమాధానం కరువే. నిషేధపు ఉత్తర్వులు జారీ చేయడం, ఆ ఉత్తర్వులు అమలవుతున్నాయా.. లేదా? అనే పర్యవేక్షణ కొరవడడం ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించడంలో విఫలమవుతున్న కారణంగానే ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పాలిథిన్ (ప్లాస్టిక్) వినియోగం సగటు మనిషి జీవితంలో ఒక భాగమైంది. ఫలితంగా పర్యావరణానికి విఘాతం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్లాస్టిక్ నిషేధపు ఉత్తర్వులు జారీ చేసినా, అవి ఎక్కడా అమలకు నోచుకోవడం లేదు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పురపాలికల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయించి అందుకు తగ్గట్టు చెత్త సేకరణ వాహనాలను సైతం సమకూర్చింది. దీనికి తోడు మున్సిపల్ అధికారులు సైతం అప్పట్లో రంగంలోకి దిగి వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ కవర్లు వినియోగించే వారిపై జరిమానాలు విధించారు. ఈ పరిణామాలతో జిల్లాలోని పురపాలికల్లో మార్పు వస్తుస్తుందని ఆశించారు. కానీ, అధికారుల పర్యవేక్షణ కరవైపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వచ్చింది.

నిబంధనలు బేఖాతరు..

రహదారులపై వ్యాపారాలు కొనసాగించే హోటల్ నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కిరణా దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఉన్న నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకోకుండా రోడ్లమీద ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. దుకాణాల్లో పోగయ్యే చెత్తను ఉదయం పురపాలక వాహనంలో వేయాలని నిబంధన ఉన్నా అదేమీ పట్టించుకోవడం లేదు.

పట్టించుకోని పాలకులు...

ప్లాస్టిక్‌ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా వాటిని ప్లాస్టిక్‌ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. చివరకు టీ, కాఫీ పార్సిళ్లు కూడా ప్లాస్టిక్‌ కవర్ల ద్వారానే తీసుకెళ్తున్నారు. అంటే మనం ప్లాస్టిక్‌ను ఏ స్థాయిలో వినియోగిస్తున్నామో అర్ధమవుతోంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారిద్ధాం అంటూ పాలకులు, అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి హడావిడి చేయడం.. అక్కడక్కడా గోడలపై కొటేషన్లు రాయడం, ప్లాస్టిక్‌ నిషేధం అంశాన్ని కేవలం కాగితాలకు, ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితం చేశారు. అన్ని శాఖల అధికారులు గతంలో జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధంపై ఇటు వ్యాపారులకు అటు ప్రజలకు అవగాహన కల్పించారు. కొన్ని దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేసి 2018చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించారు. ఆ కొద్ది రోజులు మాత్రమే ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అధికారులు తనిఖీ చేయకపోవడంతో మళ్లీ అన్ని దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లను యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. చికెన్‌, మటన్‌కు సైతం నాణ్యతలేని కవర్లను వినియోగిస్తున్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించొద్దని నిబంధన ఉన్నా ఏ ఒక్కరూ పాటించడం లేదు. వ్యాపారుల వద్ద ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు వినియోగదారులు ఇళ్ల వద్ద నుంచే బ్యాగులను తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఆకస్మిక తనిఖీలు చేపడతాం..- జి. వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్

చౌటుప్పల్ పూరపాలికలోని వ్యాపారులందరికీ ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపారులపై జరిమానాలు విధిస్తాం. ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తి స్థాయిలో నివరించాలంటే వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలే వాటిని నిషేధిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story