కోమటిరెడ్డికి పార్టీలో ఎదురుగాలి..?

by Disha Web Desk 1 |
కోమటిరెడ్డికి పార్టీలో ఎదురుగాలి..?
X

దిశ, ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తిరుగులేని నాయకుడిగా పేరుంది.మంచి ఫాలోయింగ్ ఆయన సొంతం. తను అనుకున్నది సాధించుకోవడం కోసం ఎవరినైనా ఢీకొట్టడం అలవాటు. అదే టైంలో తొందరగా కూల్ కావడం ఆయనకే చెల్లింది. అయితే కొంతకాలంగా పార్టీలో తన పట్టును నిలుపుకుంటూ వస్తున్న ఆయనకు తాజాగా పార్టీలో ఎదురుగాలి స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

కుంభం తిరిగి రావడంతో..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన అనుమతి లేకుండా ఎవరూ కొత్తగా పార్టీలోకి రారని కోమటిరెడ్డి ఉత్సాహంగా కనిపించేవారు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్‌కు తన చేతుల మీదుగానే పార్టీ కండువా కప్పారు. తన ఆధ్వర్యంలోనే నేతలు పార్టీలో చేరుతున్నారని ఉత్సాహంతో ఉన్న కోమటిరెడ్డికి ఆ సంతోషం నాలుగైదు రోజులు కూడా నిలబడలేదు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బీఆర్ఎస్‌లో చేరారు.

పార్టీ మారుతున్న వేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావాలనే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, రాజకీయంగా అణిచి వేయడానికి కుట్రలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే నిన్న, మొన్నటి వరకు కోమటిరెడ్డి అనుమతి లేకుండా పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని ప్రకటించిన రేవంత్ రెడ్డి స్వయంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎంపీ కోమటిరెడ్డికి మాట వరుసకైనా సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడంతో ఆయనకు ఎదురుగాలి స్టార్ట్ అయినట్లు అంతా భావిస్తున్నారు.

వేములు వీరేశంను వ్యతిరేకించినా..

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నా ఎంపీ కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. కాగా ఈ విషయమై కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డిని పిలిచి మందలిచ్చినట్లు సమాచారం. ఏ నియోజకవర్గంలోనైనా గెలిచే అవకాశం ఉన్న ఏ నాయకుడిని వదులుకోవద్దని, ఎవరు అడ్డుకున్నా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కోమటిరెడ్డి కొంత వెనక్కి తగ్గారని వినికిడి.

దీంతో వేముల వీరేశం చేరికకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన వేముల త్వరలోనే పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో కోమటిరెడ్డి ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు కూడా కోమటిరెడ్డికి ఝలక్ ఇచ్చేలా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story

Most Viewed