సామాన్యుల‌కు షాక్‌..నకిలీ బ్రాండ్‌లతో బియ్యం సరఫరా

by velandi.Saikiran |   (  Updated:2026-03-29 02:46:03  IST  )

బియ్యం వ్యాపారాలను నిర్వహించే మిల్లర్లతో పాటు మరికొందరు బియ్యం సరఫరా చేసే వ్యాపారులున్నారు.

సామాన్యుల‌కు షాక్‌..నకిలీ బ్రాండ్‌లతో బియ్యం సరఫరా
X
  • బ్రాండెడ్ కే బ్యాండ్.
  • నకిలీ బ్రాండెడ్ బస్తాలతో బియ్యం వ్యాపారం
  • బియ్యం వ్యాపారంతో అక్రమ దాందా
  • నాడు నష్టాలు..నేడు కోట్ల అధిపతి
  • మిర్యాలగూడ వ్యాపారులలో కలకలం

దిశ, మిర్యాలగూడ టౌన్ : ఆసియా ఖండంలో అత్యధిక రైస్ మిల్లులు కలిగిన ప్రాంతంతో పాటు ఆధునిక టెక్నాలజీతో బియ్యం సరఫరా చేస్తున్న ప్రాంతంగా మిర్యాలగూడకు పేరున్నది. బియ్యం వ్యాపారాలను నిర్వహించే మిల్లర్లతో పాటు మరికొందరు బియ్యం సరఫరా చేసే వ్యాపారులున్నారు. అయితే బియ్యం వ్యాపారంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ వ్యాపారి అక్రమాలకు పాల్పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాండెడ్ కంపనీకి చెందిన బియ్యం బస్తాలను ముద్రించి నాసిరకం బియ్యం సరఫరా చేస్తూ కోట్లకు పడగలెత్తినట్లు మిర్యాలగూడలో ప్రచారం జరుగుతుంది. దీనికి నిదర్శనమే గురువారం ఆ వ్యాపారి ఇంట్లో ఢిల్లీలోని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బృందం సభ్యులు తనిఖీలు చేపట్టడంతో చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యాపారికి చెందిన ఏజెంట్ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో అక్రమాల బాగోతం వెలుగుచూసింది.

నకిలీ బ్రాండ్లతో కర్ణాటక తమిళనాడు, బీదర్ , ఏపీ బియ్యం సరఫరా

మిర్యాలగూడలో బియ్యం వ్యాపారం ప్రారంభించిన చీదెళ్ల గోపి బ్రాండెడ్ బియ్యం కంపెనీలకు చెందిన బస్తాలను తనకు చెందిన ఓ ప్రదేశంలో నకిలీ బస్తాలను ముద్రించి బియ్యం సరఫరా చేశాడు. ఈ సరఫరాలో నాసిరకం బియ్యంను తాను ముద్రించిన బ్రాండెడ్ బస్తాలలో నింపి ఆ కంపెనీల ధరలకు సరఫరా చేస్తూ వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ వ్యాపారంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నాడు. అందరి నెత్తిన టోపీ పెడుతున్నాడు. మిర్యాలగూడ పట్టణంలో నాణ్యమైన బియ్యాన్ని నాసిరకం బియ్యంతో కలిపి అసలైన వ్యాపారుల బ్రాండ్లకు వినియోగిస్తూ దందా సాగిస్తున్నాడు. అసలు బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టించి తనదైన శైలిలో వందల కోట్లకు పడగలెత్తడంతో తన వ్యాపారాన్ని విస్తరించినట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయ నాయకులు తనకు దగ్గరగా ఉంటారని బంధువులని రకరకాలుగా అందరి పేర్లను వినియోగించుకుంటూ తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని ఆరోపణలు వనస్తున్నాయి.

ప్రముఖ జీఆర్సీ బ్రాండ్ పేరుతో 100 కోట్లకు పైగా దందా ?:

దేశంలోనే బియ్యం వ్యాపారానికి పేరుగాంచిన పలు కంపెనీల నమూనాలతో బస్తాలను ముద్రించి వ్యాపారం చేస్తున్నాడు. జీఆర్సీ 24 బ్రాండ్ పేరుతో రూ.100 కోట్ల వరకు వ్యాపారం చేసినట్లు తెలిసింది. సదరు వ్యాపారి జీఆర్సీతో 24 బ్రాండ్ తో పాటు మరో కొన్ని బ్రాండ్ ను ముద్రించి వ్యాపారాన్ని నిర్వహించినట్లు తెలిసింది. పదిహేను ఏళ్లుగా గుట్టు చప్పు చేసే అక్రమ వ్యాపారంతో సుమారు 103 కోట్ల రూపాయలు కంపెనీలు నష్టపోయినట్టు గుర్తించినట్లు సమాచారం. కంపెనీలలో జిటిఎస్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టులో నిర్ణీత ఆధారాలతో కేసు దాఖలు చేశారని సమచారం. దీనిపై వైట్ కాలర్ నేరం కింద కేసు పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి ఏకకాలంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేశారు. వ్యాపారి ప్రధాన కేంద్రమైన మిర్యాలగూడ పట్టణానికి ఢిల్లీ అడ్వకేట్ కమిషన్ సభ్యుల బృందం వచ్చి పోలీసుల సహకారంతో ఆయన కార్యాలయం తనిఖీలు నిర్వహించారు.

మిర్యాలగూడలో బస్తాలు ముద్రించే ఫ్యాక్టరీలను సందర్శించి అక్కడ ఉపయోగించే లేబుళ్లు, సిలిండర్లు, బస్తాలను సీజ్ చేశారు. మిర్యాలగూడ షాబునగర్ లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సైతం సీజ్ చేశారు. మిర్యాలగూడలో మిల్లర్లు తయారు చేసే బియ్యం బ్రాండెడ్ బస్తాలను ముద్రించి వ్యాపారం చేస్తున్నారని తెలిసి గతంలో మిల్లర్స్ అసోషియేషన్ మందలించారని తెలిసింది. పట్టణంలోనే 12 బ్రాండెడ్ మిల్లర్ల బస్తాలను ముద్రించి బియ్యం సరఫరా చేసినట్లు పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. గతంలో మిల్లు నిర్వహించి నష్టాలను చూసిన వ్యాపారి ఈ దందాతో కోట్ల రూపాయాల అక్రమార్జన చేశారని విమర్శలు ఉన్నాయి. ఇతని అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story