అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు వెంట‌నే రిటైర్మెంట్ బెనిఫిట్ క‌ల్పించాలి : ఏఐటీయూసీ

by Ratna Kumari |   (  Updated:2026-01-14 12:22:22  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వాటి బెనిఫిట్‌ లు వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు వెంట‌నే రిటైర్మెంట్ బెనిఫిట్ క‌ల్పించాలి :   ఏఐటీయూసీ
X

దిశ, తుంగతుర్తి : రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వాటి బెనిఫిట్‌ లు వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆమె "దిశ"తో మాట్లాడారు. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.50 వేలు చొప్పున వడ్డీతో సహా రిటైర్‌బెనిఫిట్‌ కొరకు వెంటనే బడ్జెట్‌ విడుదల చేయాలని ఆమె కోరారు. 2023 సెప్టెంబర్‌లో చేసిన 24 రోజుల సమ్మె కాలపు వేతన బకాయిలతో పాటు రిటైర్‌మెంట్‌ అయిన టీచర్లకు, ఆయాలకు నెలకు రూ.5వేల పెన్షన్‌ సౌకర్యం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు,సెంటర్ అద్దెలు, గ్యాస్‌, ఆరోగ్య లక్ష్మి బిల్లులు ప్రతినెలా చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమే అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని, రెండు యాప్‌లను ఒకటిగా చేయాలని, 5 జీ ఫోన్స్‌తో పాటు నాణ్యమైన యూనిఫాం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు ఇచ్చే విధంగా వీరికి కూడా సెలవులు మంజూరు చేయాలని కోరారు. వంట పాత్రలు ఇవ్వడంతో పాటు అంగన్‌వాడీ టీచర్లకు సర్వీసును బట్టి సూపర్‌వైజర్‌ పదోన్నతి కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్ల,ఆయాల పరిస్థితి చాలా హృదయ విదారకరంగా ఉందని, అనారోగ్య,ఆర్థిక,సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story