న్యూ ఇయర్ వేళ జీరో టాలరెన్స్‌ ఓపెన్.. పోలీసుల హెచ్చరిక

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-12-31 07:38:51  IST  )

న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం మత్తులో హద్దులు దాటి ప్రవర్తించే వారిపై జీరో టాలరెన్స్‌‌ను అమలు చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

న్యూ ఇయర్ వేళ జీరో టాలరెన్స్‌ ఓపెన్.. పోలీసుల హెచ్చరిక
X

దిశ, రామన్నపేట/పెన్ పహాడ్ : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, పెన్‌పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. మితిమీరిన‌ వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు. మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులు, యువతకు ఆయ‌న సూచించారు.

మండల వ్యాప్తంగా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ మహిళలను ఈవ్ టీజింగ్‌కు గురిచేసే వారు, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగిన మత్తులో అసభ్య ప్రవర్తన, బెదిరింపులు, దాడులకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేళ పెన్ పహాడ్ మండలం అంతటా పోలీసులు అలర్ట్‌లో ఉంటారని, రాత్రివేళ ప్రత్యేక పెట్రోలింగ్, డ్రంకన్ డ్రైవ్ చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఏ చిన్న అనుమానాస్పద ఘటన జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్ నంబర్ +91 8712686032, డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. ప్రశాంతమైన న్యూ ఇయర్ కోసం పోలీసులతో కలిసి ప్రజలు సహకరించాలని ఎస్ఐ గోపికృష్ణ కోరారు.

Next Story