- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ దొంగల అరెస్ట్.. నగదు-కారు స్వాధీనం
చాకచక్యంగా ఫోన్ లను దొంగిలించి మనీ యాప్‌ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న వ్యక్తులను తుంగతుర్తి పోలీస్‌తో పాటు సూర్యాపేట జిల్లా సిసిఎస్ లు అరెస్టు చేశారు

దిశ, సూర్యాపేట/ తుంగతుర్తి: చాకచక్యంగా ఫోన్ లను దొంగిలించి మనీ యాప్‌ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న వ్యక్తులను తుంగతుర్తి పోలీస్‌తో పాటు సూర్యాపేట జిల్లా సిసిఎస్ లు అరెస్టు చేశారు.ఈ మేరకు రూ.2.70 లక్షల నగదుతో పాటు 27 స్మార్ట్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ గ్రామానికి చెంది సెంట్రింగ్ పని చేసే పాముల రాము అలియాస్ ఎరుకల రాము నిజామాబాద్ జిల్లాకు చెంది ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలో నివాసముంటున్న మైనర్ బాలుడు, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో మైనర్ బాలుడు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల మొబైల్స్‌ను దొంగతనం చేసి ఫోన్ లో మనీ యాప్ యూపీఐల సీక్రెట్ పిన్నులను గుర్తించి డబ్బులు దొంగతనం చేస్తుండేవారు. అయితే తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల ఉప్పలయ్య గత నెల 22వ తేదీన సూర్యాపేట నుండి తుంగతుర్తి మీదుగా అన్నారం గ్రామానికి బస్సులో వెళ్తున్నారు.
బస్సులో వెళ్లే క్రమంలో..
ఈ సమయంలో మార్గ మధ్యలో సెల్ ఫోన్ దొంగతనానికి గురైంది. తుంగతుర్తి వచ్చిన తర్వాత ఫోన్ చూసుకుంటే కనిపించలేదు. వరి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉండగా ఫోన్ దొంగిలించిన వ్యక్తులు అదే రోజు ఫోన్ లో ఉన్న మనీ యాప్ యూపిఐల పిన్ నంబర్ గుర్తించి దాని ద్వారా దఫాల వారీగా రూ. ఒక లక్ష 80 వేలను నిందితులు తమకు తెలిసిన వారి అకౌంట్ లలోకి పంపి డ్రా చేశారు. దీనిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. అలాగే తుంగతుర్తి గ్రామానికి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు తుంగతుర్తి నుండి సూర్యాపేటకు బస్సులో వెళ్లే క్రమంలో వెలుగుపల్లి గ్రామ శివారులో వెళ్ళేసరికి అతని ఫోన్ దొంగతనానికి గురైంది. ఆయన బ్యాంక్ లో ఉన్న డబ్బు రూ.97 వేల 800లు మని యాప్ ల ద్వారా ఇతర అకౌంట్‌లకు పంపి దొంగతనం చేశారు. దీనిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో బాధితుడు పిర్యాదు చేయగా ఐటి చట్టాల ప్రకారం.. రెండు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ యాప్స్ ద్వారా..
కాగా కేసు దర్యాప్తులో ఉండగా పోలీస్ శాఖ సాంకేతికత,ఇతర ఆధారాల ద్వారా గురువారం ఉదయం తుంగతుర్తి ఎస్సైతో పాటు జిల్లా సిసిఎస్ సిబ్బంది కలిసి తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తుంగతుర్తి వైపు నుండి ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు (నెంబర్: TS12EJ9817) పై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డ్రోన్ గ్రామానికి చెందిన సెంట్రింగ్ పని చేసే పాముల రాములు అలియాస్ ఎరుకల రాము, మరో ఇద్దరు మైనర్లను గుర్తించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ముఖ్యంగా నిందితులు ప్రయాణికులు ఉండే బస్ స్టాండ్ లతో పాటు ప్రయాణికులను లక్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లను దొంగతనం చేస్తారని తెలిపారు. బాధితులు తమ ఫోన్లకు సులభంగా ఊహించగలిగే స్క్రీన్ లాక్ పిన్ లేదా గూగుల్ పే, ఫోన్ పే,పేటిఎం లాంటి యాప్‌లకు సులభమైన యూపీఐ పిన్ (ఉదాహరణకు:0000, 1234, 123456, 2580, 1111) పెట్టుకుంటే నిందితులు వాటిని సులభంగా తెరుస్తారని తెలిపారు. ఆ యాప్స్ ద్వారా పెట్రోల్ బంకుల, బట్టల దుకాణాలకు డబ్బులను బదిలీ చేసి ఆయా వ్యాపార సంస్థల నుండి నగదును పొందుతారని తెలిపారు.
సీక్రెట్ పాస్వర్డ్ ను పెట్టుకోవాలి..
ఇదే పద్ధతిలో తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల ఉప్పలయ్య, వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావుల యొక్క మొబైల్ ను దొంగలించి ఫోన్ లో ఉన్న మని యాప్ పిన్ గుర్తించి దాని ద్వారా డబ్బులు దొంగిలించారని తెలిపారు. ఈ మేరకు నిందితుల నుండి రూ. 2 లక్షల 70 వేల నగదుతో పాటు 27 సెల్ ఫోన్లు,ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు బ్యాంక్ ఖాతాలు ఉపయోగించే మొబైల్ లకు బలమైన సీక్రెట్ పాస్వర్డ్ ను పెట్టుకోవాలని, మనీ యాప్ లకు సాధారణ పిన్ నెంబర్లు 1234 లాంటివి, ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు కాకుండా బలమైన పిన్ నెంబర్లను పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసు పర్యవేక్షణ చేసిన డిఎస్పీ ప్రసన్న కుమార్,పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్,ఎస్ఐ యాదవేందర్ రెడ్డి, హరికృష్ణ, తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్, పోలీస్ టెక్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ వెంకన్న,హెడ్ కానిస్టేబుల్ సాగర్ రావు, కానిస్టేబుల్ మల్లేష్, ఆనంద్, శివ సతీష్, ప్రభాకర్, మహేష్, సైదులు, రవిలను ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందజేశారు.






