కలల రహదారికి గోతులే ప్రమాదం!

by Bhanu |

కలల రహదారికి గోతులే ప్రమాదం!
X

దిశ, పెన్‌పహాడ్ : పెన్‌పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం నుంచి మునగాల మండలంలోని నేలమర్రి వరకు ఇటీవల నిర్మించిన బీటీ రహదారికి రక్షణ లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలుగా గుంతల మయంగా ఉన్న ఈ రహదారిని బీటీ రోడ్డుగా మారుస్తూ గ్రామస్తులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు చేసిన పోరాటాల ఫలితంగా 2022–23 సంవత్సరంలో రూ.3.60 కోట్ల సీసీఆర్ గ్రాంట్ నిధులు మంజూరయ్యాయి. నెలరోజుల క్రితం నిర్మాణం ప్రారంభమై, ఎత్తుగా మట్టి పూసి, కంకర వేసి బీటీ నిర్మాణం పూర్తి చేశారు.

గ్రామస్తుల ఏండ్ల కల నెరవేరిందన్న ఆనందం ఇంకా చల్లారకముందే, కొందరు స్వార్థపరులు తమ పొలాల్లోకి వరదనీరు చేరుతోందని వాదిస్తూ రహదారి పక్కనే గోతులు తవ్వడం ప్రారంభించారు. దీనివల్ల రహదారి తడిసిపడి ధ్వంసం కావచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రహదారి చెక్కుచెదరకముందే పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.

గ్రామస్తుల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం

ఈ ఘటనలపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై విరుచుకుపడ్డారు. వారివారి ప్రయోజనాల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదంతా చూస్తూ అధికారులు ఏమీ చేయకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ రహదారి మునగాల, కోదాడ మండలాలకు వెళ్ళే ప్రధాన మార్గంగా ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

చర్యలు తప్పవంటున్న అధికారులు, నాయకులు

ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న మాట్లాడుతూ.. ఇది గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కల. కొద్ది రోజులకే రహదారిని ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. పెన్‌పహాడ్ పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఘటనపై మా దృష్టికి వచ్చింది. తమ స్వార్థం కోసం రోడ్డు ధ్వంసం చేస్తున్న వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

Next Story