కష్టాలను జయించి 'డాక్టరేట్'

by Nallavelli.Anjaneyulu |

ఆర్థిక ఇబ్బందులు వెంటాడిన‌ప్ప‌టికీ అత‌ను మాత్రం చ‌దువును మాత్రం ఆప‌లేదు.

కష్టాలను జయించి డాక్టరేట్
X

దిశ, దేవరకొండ టౌన్ : అతని కుటుంబం క‌టిక పేద‌రికం. అత‌ని చిన్న‌త‌నంలోనే తండ్రి మ‌ర‌ణించాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడిన‌ప్ప‌టికీ అత‌ను మాత్రం చ‌దువును మాత్రం ఆప‌లేదు. అలాగే త‌న చ‌దువు కొన‌సాగించి ఆ యువ‌కుడి సంక‌ల్పాన్ని అడ్డులేక‌పోయాయి. ప‌ట్టుద‌ల‌నే పెట్టుబ‌డిగా శ్ర‌మించి ఒకేసారి అటు పీహెచ్డీ ప‌ట్టా.. ఇటు దేశ ర‌క్ష‌ణ రంగ సంస్థ డీఆర్డీఓలో సైంటిస్ట్ ఉద్యోగం సాధించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నాడు. అత‌నే న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ మండ‌లం అచ్చ‌మ్మ‌కుంట గ్రామ‌పంచాయ‌తీకి చెందిన ప్ర‌శాంత్. పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ నుంచి గ‌ణితంలో పీహెచ్డీ ప‌ట్టా అందుకున్నారు. ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ చంద్రశేఖర్ రావు, వినోద్ మల్హోత్రా పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ప్రశాంత్, కుటుంబ భారంతో పాటు అనేక సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. "ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం వదలలేదు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చు" అని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పారు.

డీఆర్‌డీఓ సైంటిస్ట్‌గా ఎంపిక

తన మేధస్సుతో ప్రశాంత్ తమిళనాడులోని అవాడి డీఆర్‌డీఓ విభాగంలో అసిస్టెంట్ సైంటిస్ట్‌గా ఎంపికయ్యారు. ఒక సామాన్య గిరిజన పల్లె నుంచి దేశ రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా ఎదగడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తన గురువులకు, కుటుంబ సభ్యులకు ప్రశాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story