సారూ.. వాసాలమర్రి దిక్కు చూడరు?

by Dishanational2 |
సారూ.. వాసాలమర్రి దిక్కు చూడరు?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఓ వైపు తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాలను సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండగా.. మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించగా.. ఎప్పుడు కొంటారా.. అని నెల రోజులుగా పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. వడ్ల కుప్పలతో నిండిపోయింది. ఎప్పుడు వాన పడుతుందో తెలియక భయంతో ధాన్యాన్ని బస్తాలు, చీరలతో కప్పి దాస్తున్నారు. ఇప్పటికే పడిన వానలకు తడిసిన ధాన్యం మొలకెత్తున్నాయి. ఇట్ల ఎందుకు చేస్తున్నారు.. సారు అని అధికారులను అడిగితే.. లారీలు రావడం లేదని సమాధానం దాటవేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో రైతుల దయనీయ పరిస్థితి ఇది.

నెల రోజులకు పైగా..

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి సుమారు నెలరోజులు అయితున్నా కొనే దిక్కు లేదు. అధికారులను ఎంత అడిగినా లారీలు రావడం లేదనే చెబుతున్నారు. పైగా అధికారులు కూడా ‘‘మీరు లారీలు తెచ్చుకోండి.. మేము ధాన్యాన్ని పంపిస్తాం’’ అని ఉచిత సలహా ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయం చూపడం లేదు. అటు లారీలు రాక.. ధాన్యాన్ని కొనేవారు లేక.. ఎలా అమ్ముకోవాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. చేసేదేమీ లేక కొందరు ప్రైవేటు వాహనాల్లో ధాన్యాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. గ్రామంలో సుమారు ఇంకా 600 టన్నులకు పైగా ధాన్యం తరలించాల్సి ఉంది.

మొలకలు వచ్చే పరిస్థితి..

ఇప్పటికే పడిన వానలకు ధాన్యం తడిసిపోగా మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ఉంటే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ పట్టనట్టుగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సర్కారు మాత్రం చెరువుల పండగ పేరుతో సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులకంటే సంబరాలు ఎక్కువ అంటూ మండిపడుతున్నారు.

వానల సీజన్ వస్తుండగా..

రుతుపవనాల సీజన్ రావడంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. ఏ సమయంలో వానలు పడతాయోనని ఆవేదన చెందుతున్నారు. ఒక రోజు ఎండ తీవ్రత పెరగడం, మరో రోజు వర్షం కురవడం, వాతావరణం చల్లబడడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టే విషయంలోనూ ఆందోళనకు లోనవుతున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందోనంటూ టెన్షన్ పడుతున్నారు.

పట్టించుకునే దిక్కులేదు

ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువైపు వచ్చి చూసిన దిక్కులేదు. అడిగితే లారీలు రావడం లేదంటున్నారు. ఇప్పటికే మొలకలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి‌. లేదంటే తీవ్రంగా నష్టపోతాం.

- పలుగుల రాజు, రైతు, వాసాలమర్రి

Next Story

Most Viewed