అత్యంత వైభవంగా నారసింహుడి బ్రహ్మోత్సవాలు

by Naveena |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

అత్యంత వైభవంగా నారసింహుడి బ్రహ్మోత్సవాలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవములలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామి వారిని శ్రీకృష్ణాలంకారం (మురళీకృష్ణుడు) శేవగా అలంకరించి ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందము, పారాయణీకులు అత్యంత వైభవంగా ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహ మూర్తి, ఈవో ఎ. భాస్కర రావు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకుమ్నారు.

శ్రీకృష్ణాలంకారము (మురళీకృష్ణుడు) ప్రత్యేకత

భగవానుడు శ్రీకృష్ణ అవతారములో, మురళీకృష్ణునిగా తన దివ్యమైన వేణుగానంతో సమస్త ప్రాణికోటికి, చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని అందించిన విలక్షణమైన తత్త్వముగా భాగవతంలో సూచించబడుతుంది. మురళీకృష్ణుడు బృందావనంలోని ఆబాలగోపాలంను, సమస్త ప్రకృతి మండలంను తన వేణుగానంతో పరవశింపచేసాడని, వేణువు నుండి వెలువడే నాదమే ప్రణవనాదమని, ఆ నాద శ్రవణం పరమాత్మ అనుగ్రహమునకు ప్రథమ సోపానమని వల్లభాచార్యుల వారు స్తుతించారు. శ్రీ స్వామివారు మురళీకృష్ణ అలంకారములో తన రమణీయమైన, సౌందర్యాతిశయమును దర్శింపచేస్తూ సమస్త ప్రాణికోటిని తనవైపు ఆకర్షిస్తూ భక్తులను అనుగ్రహించుట ఎంతో విశేషమై ఉంది. సాయంత్రం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం రాత్రి స్వామి వారిని పొన్న వాహన శేవలో అలంకరించి తిరు వీధులలో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా ఊరేగింపు వేడుక నిర్వహించారు‌.

పొన్నవాహన శేవ ప్రత్యేకత

బ్రహ్మోత్సవములలో శ్రీ పాంచరాత్రాగమ సాంప్రదాయములో పొన్న(కల్పవృక్ష వాహన సేవకు ఎంతో ప్రత్యేకత ఉంది. భగవత్ విభూతి విశేషంగా వ్యక్తమయ్యే పక్షులు, వృక్షాలు, జంతువులు, పదార్థాలు అన్నీ ఆయనను వహించి సేవలు అందిస్తూ ఉంటాయని ప్రధానార్చకులు వివరించారు. కావున స్వామి వారిని పొన్నవాహనముపై ఊరేగిస్తారని, కోరిన వాటిని కల్పించి ఇవ్వగల మహిమ గలది కాబట్టే ఇది కల్పవృక్షమన్నారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహా మంటపే అని స్వామి వారిని గూర్చి ధ్యాన శ్లోకములో స్తుతించినట్లుగా స్వామి వారికి, కల్పవృక్షానికి అవినాభావ సంబంధముందని, తనను ఆశ్రయించిన భక్తుల పాలిటి కల్పతరువు భగవానుడని, శ్రీ స్వామి వారు ఇహపర ఆనందదాయకుడై భక్తులను సంరక్షిస్తూ పొన్న వాహనారూఢుడై భక్తులకు దర్శన భాగ్యము కలిగించుట ఎంతో ప్రత్యేకమై ఉందని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు.

Next Story