Breaking News: బాలికపై అత్యాచారం.. నల్గొండ పోక్సోకోర్టు సంచలన తీర్పు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-26 07:07:54  IST  )

బాలికలు, మహిళలపై సైకోలు, కామాంధులు పేట్రేగిపోతున్నారు. ఆడదాని ఉసురు తీసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Breaking News: బాలికపై అత్యాచారం.. నల్గొండ పోక్సోకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్/నల్లగొండ: బాలికలు, మహిళలపై సైకోలు, కామాంధులు పేట్రేగిపోతున్నారు. ఆడదాని ఉసురు తీసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. 2021లో మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసిన కేసులో నల్గొండ పోక్సో కోర్టు (Nalgonda Pocso Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుపై విచారణ పూర్తవ్వగా.. ఇరువైపులా వాదనలు పరిశీలించిన పోక్సో కోర్టు ఇన్ ఛార్జ్ జడ్జి రోజారమణి నిందితుడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.

అత్యాచారం జరిగిన తీరు

2021 నవంబరు 3న స్కూల్ ముగించుకొని బస్ స్టాప్ వద్ద తన స్నేహితులతో కలసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బాలికను, నిందితుడు షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా బండి ఎక్కించాడు. అనంతరం ఆమెను పట్టణ శివారులోని ఒక పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో డిసెంబరు 5న కేసు నమోదు చేశారు.

నమోదైన సెక్షన్లు

366, 376(2)(i), 516(3), 506 IPC,సెక్షన్ 3 R/W 4 of POCSO Act, 2012,సెక్షన్ 3(2)(v), 3(2)(va) of SCs/STs (POA) Amendment Act, 2025. SC No.94/2022 కింద కేసు దాఖలై, నిందితుడిని రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరుస్తూ న్యాయపరమైన చర్యలు కొనసాగించారు.

విచారణ విధానం

ఈ కేసులో దర్యాప్తు అధికారులు జి. వెంకటేశ్వర్ రెడ్డి, మట్టయ్య కీలక ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కోర్ట్ పి.సి డి. కిరణ్‌కుమార్ (3209), ప్రస్తుత ఎస్‌ఐ ఎన్. శంకర్ ఆధారాలతో నిందితునిపై అభియోగాలు బలపరిచారు. బాధితురాలు, కుటుంబ సభ్యులు, వైద్యులు, సాక్షులు సహా మొత్తం 20 మందికి పైగా సాక్షులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.

కోర్టు తీర్పు

ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి ఈరోజు తుది తీర్పు వెలువరించారు. అత్యాచార నేరంలో 20 ఏళ్ల జైలు శిక్ష, పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద 10 ఏళ్ల జైలు శిక్ష.. మొత్తం 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. రూ.85,000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించారు.

ప్రాసిక్యూషన్ వాదనలు

ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడి నేరం ఘోరమైనది. మైనర్ అమ్మాయిపై దాడి చేయడమే కాకుండా, ఆపై బెదిరింపులకు పాల్పడటం సమాజానికి ముప్పు. ఇలాంటి నేరస్తులకు కఠిన శిక్ష తప్ప వేరే మార్గం లేదని కోర్టు ఎదుట బలంగా వాదించారు.

కాగా.. 2013లో 12 ఏళ్ల మైనర్ పై జరిగిన హత్యాచారం కేసులోనూ వారంరోజుల క్రితం నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహమ్మద్ ముకర్రం అనే వ్యక్తి మైనర్ పై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణలో రుజువు కావడంతో జడ్జి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించారు. అలాగే రూ.1.10 లక్షల జరిమానా విధించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసి, ఆపై చంపేసి మృతదేహాన్ని పంటపొలాల్లో పారేశాడు. అప్పుడే పోక్సో, హత్య కేసులు నమోదవ్వగా 2015లో ఛార్జిషీటు దాఖలు చేశారు.

Next Story