ఆ కార్యాలయంలో అన్నీ 'ఆర్జిత' సేవలే..!?

by Bhanu |   (  Updated:2025-05-07 10:38:03  IST  )

పుణ్యక్షేత్రాల్లో దైవదర్శనం కోసం.. ఆర్జిత సేవలు, వీఐపీ సేవలు, సాధారణ సేవలు అని వింటుంటాం.. అలాగే టూరిస్టు ప్రదేశాల్లోనో, ప్రైవేటు సంస్థల్లోనో డబ్బులు వెచ్చించి సేవలను పొందుతుంటాం.. కానీ ఇక్కడి ప్రభుత్వ కార్యాలయంలో సేవలు పొందాలి అంటే డబ్బులు సమర్పించాల్సిందేనని వినికిడి.

ఆ కార్యాలయంలో అన్నీ ఆర్జిత సేవలే..!?
X

దిశ, నడిగూడెం: పుణ్యక్షేత్రాల్లో దైవదర్శనం కోసం.. ఆర్జిత సేవలు, వీఐపీ సేవలు, సాధారణ సేవలు అని వింటుంటాం.. అలాగే టూరిస్టు ప్రదేశాల్లోనో, ప్రైవేటు సంస్థల్లోనో డబ్బులు వెచ్చించి సేవలను పొందుతుంటాం.. కానీ ఇక్కడి ప్రభుత్వ కార్యాలయంలో సేవలు పొందాలి అంటే డబ్బులు సమర్పించాల్సిందేనని వినికిడి. ప్రభుత్వ కార్యాలయంలో 'ఆర్జిత' సేవలేంటి అని ఆలోచిస్తున్నారా.. మీరు వింటుంది నిజమే.. సాధారణంగా పుణ్యక్షేత్రంలో దైవదర్శనం కోసమో.. ప్రకృతి అందాలను వీక్షించేందుకో నిర్ణీత ఫీజులను చెల్లిస్తుంటాం.. ఇక్కడ అంతకు మించి వీఐపీ సేవలు, ఆర్జిత సేవలు, సాధారణ సేవలని విభజించి వీఐపీ, ఆర్జిత సేవలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మాకేమి తక్కువ మేము అందించేది సేవలే కదా.. మా సేవలు ఖరీదైనవే అనుకున్నారో ఏమో.. నడిగూడెం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాము అందించే పనికి సప"రేటు" ఉంటుందని వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి పైసల వసూళ్లకు పాల్పపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్హతతో పనిలే.. పైసలిస్తే ఫర్వాలే... !

సాధారణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలు పొందాలి అంటే ముందుగా మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులు చేసుకోవాలి. అనంతరం సంబంధిత దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలి. వాటిని కార్యాలయ సిబ్బంది పరిశీలించి, విచారణ జరిపి అర్హత నిర్ధరణ తర్వాత సర్టిఫికేట్లను జారీ చేస్తారు. కానీ నడిగూడెం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తమ రూటే సపరేటు అన్నట్లుగా అనర్హులకు సైతం ధృవపత్రాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 అక్టోబరు లో మండలంలోని ఓ గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తుడు అనర్హుడు అని తెలిసినప్పటికీ కుమారుడి ఉద్యోగం కోసం ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గం) సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోగా.. విచారణ అనంతరం సరైన ఆధారాలు (పత్రాలను) సమర్పించలేదనే కారణంతో తహసీల్దార్ దరఖాస్తును డిసెంబర్ నెలలో తిరస్కరించారు. అనంతరం తహశీల్దార్ సెలవుల్లో వెళ్లడం, చిత్రంగా నెల రోజుల వ్యవధి తర్వాత సదరు యువకుడికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందే రిజర్వేషన్ కు 5ఎకరాల్లోపు వ్యవసాయ భూమి, అన్ని మూలాలు నుండి (వ్యవసాయం, వృత్తి, జీతం, వ్యాపార) వార్షిక ఆదాయం 8 లక్షల్లోపు, 1000 అడుగుల లోపు నివాస స్థలం, నోటిఫైడ్ అయిన మున్సిపాలిటీ లలో 100 గజాల్లోపు స్థలం, నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ లలో 200 గజాల లోపు కలిగిన ఆయా కుటుంబాలు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందే రిజర్వేషన్ కోసం 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి, వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ధృవపత్రం పొందిన యువకుని కుటుంబానికి సుమారు 10 ఎకరాల పైచిలుకు వ్యవసాయ భూమి, ట్రాక్టర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొదట అనర్హత అని తిరస్కరించిన దరఖాస్తు విచిత్రంగా నెల రోజుల్లోనే అర్హత పొందడం వెనుక ఓ రాజకీయ నాయకుని మధ్యవర్తిత్వంతో రూ. 20 వేల వరకు కార్యాలయ సిబ్బంది తీసుకున్నట్లు సమాచారం. అత్యంత గోప్యంగా జరిగిన ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారులతో పాటు క్లరికల్ సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


రాజకీయ నాయకుల మధ్యవర్తిత్వం.. !

కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బందికి రాజకీయ నాయకులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల మంజూరులో కార్యాలయ ఖర్చుల పేరుతో రూ.5 వేల నుంచి 10 వేల వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన లబ్ధిదారురాలి కూతురి వివాహం జరగగా ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకుంది. వధువు ఆధార్ కార్డులో వయస్సు తప్పుగా నమోదై ఉండడాన్ని గుర్తించిన అధికారులు వయస్సును సరి చేయించుకోవాలని చెప్పగా పక్క మండలంలోని ఓ శాశ్వత ఆధార్ కేంద్రంలో వయస్సు సరి చేసినందుకు రూ. 10వేలు, అధికారుల కమీషన్లు, పేరర్ వర్కు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి రూ. 32 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని సదరు బాధితురాలు వాపోయింది. అదేవిధంగా ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ల పొందేందుకు కొందరు అనర్హుల నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకొని

ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పని ఏదైనా సరే "పైసలు కొట్టు సర్టిఫికేట్ పట్టు" అన్నట్లు నడిగూడెం తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది వ్యవహారశైలి వున్నట్లు తెలుస్తుంది.


బాధ్యులపై చర్యలు తప్పవు.. : వాసిమళ్ల సరిత, తహసీల్దార్ నడిగూడెం

అనర్హులకు సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తన దృష్టికి రాలేదు.. విచారణ జరిపి ఉన్నతాధికారులు నివేదిక అందజేస్తాం. తప్పుడు ధృవపత్రాల జారీకి పాల్పడే వారు ఎవరైనా శాఖాపరమైన చర్యలు తప్పవు.

Next Story