మనీ..మాయం.. ఆన్‌లైన్ హైటెక్ మోసం.!

by Disha Web Desk 9 |
మనీ..మాయం.. ఆన్‌లైన్ హైటెక్ మోసం.!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: సైబర్ నేరగాళ్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సిస్టంలను హ్యాక్ చేయడం లేదా డేటాను చోరీ చేసి ఆ డేటా ఆధారంగా ఆధార్ నంబర్లు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా బ్యాంకులోని డబ్బును మాయం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో పెనుదుమారం రేగుతోంది. జనవరి నెలలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ క్రయ విక్రయదారులు, సాక్షులుగా వెళ్లిన వ్యక్తుల అకౌంట్లలో రూ. 10 నుంచి రూ. లక్ష వరకు ఎలాంటి సమాచారం లేకుండానే విత్ డ్రా కావడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రతినెలా ఇలాంటి రిజిస్ట్రేషన్ల వందల సంఖ్యలో నమోదు అవుతున్న పరిస్థితిలో సైబర్ నేరగాళ్లు ఇంకా ఎంతమంది డేటాను చోరీ చేసి ఉంటారో.. ఇలా ఎంతమంది అకౌంట్లో డబ్బు మాయం కాబోతున్నాయంటూ ఆయా ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే నాగర్ కర్నూల్ సర్కిల్ పరిధిలో వందల సంఖ్యలో బాధితులు తమ అకౌంట్లో డబ్బు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

హైటెక్ సైబర్ మోసం.!

ప్లాట్ల రిజిస్ట్రేషన్ క్రయవిక్రయాలు జరిపిన వ్యక్తులతో పాటు సాక్షులుగా వచ్చిన వ్యక్తుల అకౌంట్లలోనూ డబ్బు మాయం కావడం హైటెక్ మోసంగానే కనిపిస్తుంది. సాధారణ వ్యక్తులకు సాధ్యపడని రీతిలో ఓ సిస్టం నుంచి డేటాను సేకరించడం.. సిస్టంలో నమోదైన వేలిముద్రల ఆధారంగా ఆధార్ లింకైన అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేయడం హైటెక్ సైబర్ మోసాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుల ప్రమేయం లేకుండానే ఎవరి అకౌంట్‌లకు బదిలీ అయ్యాయి అన్న అంశాలు కూడా సదరు ఖాదారుడికి తెలియకుండా సైబర్ నేరగాళ్లు జాగ్రత్త పడుతున్నారు.

అయితే ఒక్క సబ్ రిజిస్ట్రార్ లోనే వేల సంఖ్యలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే ఈ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు ఒకే జిల్లాకు పరిమితమయ్యారా లేక ఏలాంటి సిస్టంనైనా హ్యాక్ చేయగలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కార్యాలయంలో పనిచేసే వ్యక్తులే ఈ మోసానికి పాల్పడితే పెద్ద ప్రమాదమే ఉండకపోవచ్చని ఒకవేళ సిస్టంలోని డేటాను చోరీ చేస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఖాతాదారుల అకౌంట్లను ఖాళీ అయ్యే పరిస్థితి లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి హైటెక్ మోసాన్ని నిలువరించకపోతే భారీ నష్టాన్ని సరిచూడాల్సి వస్తుందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాక్షి సంతకం చేశా.

మూడు నెలల క్రితం నాగర్ కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ప్లాట్ విక్రయం జరుగుతున్న క్రమంలో సాక్షి సంతకం చేశా. మూడు రోజుల క్రితం నా అకౌంట్ నుంచి రూ. 9800 నగదు విత్‌డ్రా అయింది. దీనిపై బ్యాంక్ మేనేజర్ ను ప్రశ్నించగా తనకేమీ తెలియదు అంటూ సమాధానం ఇచ్చారని దీంతో బాధితుడు బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపాడు.


ఆందోళన చెందొద్దు

ఖాతాదారుల అకౌంట్లో నుంచి తమ అనుమతి లేకుండా డబ్బు మాయమవుతున్నట్లు ఒక్కరోజే సుమారు 20 మంది నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. వారందరి పూర్తి వివరాలను సేకరించి కేసు నమోదు చేశాం. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటాం. అప్పటివరకు ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింకును తొలగించండని నాగర్ కర్నూల్ సీఐ జక్కుల హనుమంతు వెల్లడించారు.

Next Story

Most Viewed