తెలుగు టీచర్ కోసం ఎంఈఓ నిర్బంధం

by Ratna Kumari |   (  Updated:2026-01-29 09:36:13  IST  )

మండల పరిధిలోని పలివెల జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో గత మూడు నెలల నుంచి తెలుగు టీచ‌ర్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలుగు టీచర్ కోసం ఎంఈఓ నిర్బంధం
X

దిశ, మునుగోడు : మండల పరిధిలోని పలివెల జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో గత మూడు నెలల నుంచి తెలుగు టీచ‌ర్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏఐఎస్ఎఫ్, బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పలివెల చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వ‌హించారు. సంబంధిత విద్యాశాఖ అధికారులను నిర్బంధించారు. ఈ సంద‌ర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్షులు గోపగోని ఉదయ్ మాట్లాడుతూ విద్య ప‌రంగా విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడకుండా పలివెల హై స్కూల్‌కు అర్హత కలిగిన తెలుగు ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీ సంఘం నాయకులు ఆనగంటి కృష్ణ పాల్గొని విద్యార్థుల హక్కుల కోసం ఐక్య పోరాటం అవసరమని ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షులు గోసుకొండ మల్లేష్, చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెరుకు సైదులు, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఆనగంటి నరసింహ , వరికుప్పల రాజు, కొండూరు మల్లికార్జున్, దాడి జితేందర్ రెడ్డి, మాధగోని మల్లయ్య గోసుకొండ రవి ,నాతి రమేష్ , గజ్జల నాగరాజు, శివర్ల నాగరాజు, వరికుప్పల శంకర్, పంతంగి గోపాలు, యాదయ్య, నరసింహ, జెట్టి మల్లయ్య పాల్గొన్నారు.

Next Story