సూర్యాపేట జిల్లాను షేక్ చేస్తున్న మెడికల్ ‘కిల్లర్’.. ఎన్ని భ్రూణ హత్యలు జరిగాయో లెక్కతేలేనా..?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-07-26 13:38:58  IST  )

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫీయా ఆగడాలు ఆగడం లేదు.

సూర్యాపేట జిల్లాను షేక్ చేస్తున్న మెడికల్ ‘కిల్లర్’.. ఎన్ని భ్రూణ హత్యలు జరిగాయో లెక్కతేలేనా..?
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫీయా ఆగడాలు ఆగడం లేదు. కొన్నాళ్లుగా ఇక్కడ అర్హతలేని డాక్టర్లు చికిత్సలు చేయడం, పర్మిషన్ లేని స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుంటడం బహిరంగంగానే జరుగుతున్నది. అసలు వైద్యులను మించి నకిలీ వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్‌కు ఐఎంఏ సైతం షాక్ అయింది. అర్హత లేని వాళ్లు డాక్టర్లను శాసిస్తూ.. అడ్డగోలుగా చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తుండటంతో ఇటీవల ఐఎంఏ జిల్లా వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేయడంతో మళ్లీ తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా మెడికల్ మాఫీయా చెలగేగిపోయింది.

తాజాగా సరైన అనుమతులు లేకుండానే మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మరొకరితో కలిసి ఏకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం జిల్లాలో కలకలం సృష్టిచింది. జిల్లా నడిబోడ్డున జరుగుతున్న ఈ తంతు జిల్లా వైద్యాధికారులకు తెలియకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉప్పందడంతో శుక్రవారం మెడికల్ షాప్‌పై దాడులు చేసి, ఈ చీకటి దందా బయటపెట్టారు. చర్చి కాంపౌండ్‌లోని మన్నా చర్చికి ఎదురుగా ఎలగందుల వేలాద్రి మహాగణపతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆయనకు విద్యానగర్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో సూరర్ వైజర్‌గా పని చేస్తున్న నాగేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వీరిద్దరు కలిసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

రెండేళ్లుగా మెడికల్ షాప్‌‌ను అడ్డాగా ఏర్పాటు చేసుకోని సూట్ కేసులో ఇమిడిపోయే అల్ట్రా సౌండ్ (లింగనిర్ధారణ పరీక్షలు చేసే) మిషన్‌ను ఏర్పాటు చేసి గర్భిణీలకు అక్రమంగా టెస్టులు చేస్తున్నారు. విద్యానగర్‌లోని ఓ హాస్పిటల్‌తోపాటు మరికొన్ని హాస్పటల్స్‌తో మాట్లాడుకోని అక్కడికి వచ్చే గర్భిణీలను మెడికల్ స్టోర్‌కు తరలించి ఇల్లీగల్ టెస్టులు చేశారు. కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ అని తెలుపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలను ఏజెంట్లుగా పెట్టుకుని వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల గర్భిణీలకు టెస్టులు చేసినట్టు తేలింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా వీరిద్దరు ఏళ్ల తరబడి యథేచ్ఛగా టెస్టులు చేయడం విస్మయానికి గురి చేసింది.

వీరి ఇల్లీగల్ దందాపై పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించి అల్ట్రా సౌండ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాపునకు సైతం సరైన అనుమతులు లేవని గుర్తించారు. అంతే కాదు.. పెళ్లి కాని యువతులకు అబార్షన్లు సైతం చేయించినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం ఈ తనిఖీల్లో పాల్గొని వీరి అక్రమ దందాను చూసి ఖంగుతిన్నారు. వీరిపై సూర్యాపేట మెడికల్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ వెంకటయ్య తెలిపారు. మరోవైపు సూర్యాపేట కేంద్రంగా విచ్చలవిడిగా మెడికల్ మాఫీయా దందా నడుస్తుందని, అవసరం లేని టెస్టులు, చికిత్సలు లేని లక్షల రూపాయలు దండుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేని వాళ్లంతా హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ షాపులు పెట్టి పేద ప్రజలను దండుకుంటున్నారని కొన్నాళ్లుగా ప్రజాసంఘాల నాయకులు, మీడియా కోడై కూస్తున్నా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Next Story