దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది: కడియం, చిరుమర్తి

by Dishanational1 |
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది: కడియం, చిరుమర్తి
X

దిశ, నకిరేకల్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి ప్రతిపక్షాలకు కనిపించట్లేదా..? అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జి కడియం శ్రీహరి ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రం మొండి చేయి చూపుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నార్కట్ పల్లి మండలంలోని జువ్విగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మూడోసారి ముచ్చటగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రతి ఇంటి గడపకు న్యాయం చేకూర్చిన కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. తెలంగాణ రాకముందు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారని, ప్రస్తుతం 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని తెలిపారు.


రాష్ట్రంలో రైతులకు అందుతున్న విద్యుత్తు, నీటి సౌలభ్యం వల్ల దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. గత పాలకులు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పునరుద్ఘాటించారు. ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దుచేసి ప్రజాస్వామ్యాన్ని మోదీ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణాలు మాఫీ చేస్తుంటే.. మోడీ మాత్రం కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయలు మాఫీ చేసి సంపదను కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని పునరుద్ఘాటించారు. అంతకుముందు జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతు సమితి అధ్యక్షులు యానాల అశోక్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎండీ వాజిద్ అలీ, సర్పంచులు బద్దం వరలక్ష్మి, ఈద మాధవి, కర్నాటి ఉపేందర్, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, చిరుమర్తి యాదయ్య, కుమారస్వామి, మాజీ సర్పంచ్ మల్లెబోయిన సైదులు, చింత ప్రమీల, యూత్ నాయకులు కన్నెబోయిన సైదులు, బెల్లి సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed