విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

by Nallavelli.Anjaneyulu |

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉన్నత చదువులకోసం ఫారెన్ పంపిస్తానని నిరుద్యోగ యువతను మోసం చేస్తూ జల్సాలకు పాల్పడుతున్న ఓ అంతర్ రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం
X

దిశ, నల్లగొండ క్రైం : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉన్నత చదువులకోసం ఫారెన్ పంపిస్తానని నిరుద్యోగ యువతను మోసం చేస్తూ జల్సాలకు పాల్పడుతున్న ఓ అంతర్ రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా డీపీవోలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ జి.రమేష్ ఈ కేసు వివరాలు వెల్ల‌డించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల లీలా కృష్ణ గతంలో దుబాయ్, చైనా, బ్యాంకాక్, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగం చేశాడు. అక్కడి పరిచయాలను ఉపయోగించుకొని, భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి ఇప్పటివరకూ మొత్తం 8 మంది నుంచి సుమారు రూ.85లక్షల వరకూ తీసుకున్నాడు. ఇలా సంపాదించిన డబ్బుతో నిందితుడు కొంత డబ్బును విలాసాలకు, జల్సాలకు ఖర్చు పెట్టాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్ ఇలా మోసపోయినట్లుగా చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రామ్మూర్తి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం మాల్ గ్రామం మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా ముప్పాళ్ల లీలా కృష్ణ సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, విదేశాల్లో ఉద్యోగాలతో పేరుతో తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను, 30 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై క్రైం నెంబర్ 253/2025 యూ/ఎస్ 318(4) బీఎన్ఎస్ఎస్, 66-డీ ఐటీ చట్టం2000–2008, మాడుగులపల్లి పీఎస్ (తేదీ 24-12-2025) క్రైం నెంబర్.24/2026 యూ/ఎస్318(4) బీఎన్ఎస్, ఏజే మిల్స్ కాలనీ, వరంగల్ పీఎస్ (తేది: 10-01-2026)న కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డెబిట్ కార్డులు వివిధ బ్యాంకుల ద్వారా చింతపల్లి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్ వస్తే అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో తెలుస్తుంది.

నిరుద్యోగ యువత మోస పోవొద్దు..

ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అధికారిక నోటిఫికేషన్లు, గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారానే పొందాలని అదనపు ఎస్పీ సూచించారు. ఉద్యోగం పేరుతో ఎవరైనా డబ్బుఅడిగితే వెంటనే అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తూ, జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండి మోసాలకు గురికాకుండా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామ్మూర్తి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story