- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమాత్‌పల్లిలో అక్రమ వెంచర్
కంచె చేను మేస్తున్న వైనం" యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో దర్శనమిస్తోంది.

దిశ, యాదాద్రి కలెక్టరేట్: కంచె చేను మేస్తున్న వైనం" యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో దర్శనమిస్తోంది. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను, పంచాయతీ ఆదాయ వనరులను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారే అక్రమ వెంచర్ నిర్మాణానికి పాల్పడిన తీరు గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తుంది. 2023లోనే గ్రామ పంచాయతీ ఇచ్చిన నోటీసులను సైతం లెక్క చేయలేదు. నేనే సర్పంచ్ ఎవరు ఏం చేయలేరు అనుకున్నారో ఏమో కానీ అనుమతులు లేకుండా బినామీల పేర్ల మీద అక్రమంగా వెంచర్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామములోని సర్వే నెంబర్ 125/ఇ/1/2 లో 1-09 గుంటలు ఉన్న భూమిని హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి అనుమతులు లేకుండానే అక్రమంగా లేఅవుట్ చేశారు. గ్రామపంచాయతీకి రావలసిన 10% భూమిని సైతం మార్టిగేజ్ చేయడంలో నిబంధనలను తుంగలో తొక్కారు. చట్ట విరుద్ధంగా ప్లాట్లు చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ స్వలాభం కోసం తన అనుచరుల కొరకు వారి పేరున అక్రమ తీర్మానం చేసి గ్రామ అవసరాలకు 10 శాతం గ్రామ పంచాయతీ కి ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా ప్లాట్లను, రోడ్లను చేస్తూ 151 గజాలు గ్రామ పంచాయితీకి ఇస్తామని అక్రమ తీర్మానము చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ ఈ వెంచర్ లో ప్లాట్లను విక్రయిస్తూ భూమిపై బ్యాంకులలో లోన్లు తీసుకొని ప్రజలను మోసం చేశారనే ఆరోపణలు బహిర్గతం అవుతున్నాయి.
అనుమతుల్లేవ్, మౌలిక సదుపాయాల్లేవ్..
డీటీసీసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే వెంచర్ నిర్మాణం చేసి ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. కనీసం గ్రామపంచాయతీ నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే లేఔట్ చేశారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం వెంచర్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వెంచర్ లో ప్రజల అవసరాల కోసం విద్యుత్ స్తంభాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కు స్థలం వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను వెంచర్ నిర్మాణ యాజమాన్యం తుంగలో తొక్కింది. ఎటువంటి సదుపాయాలు కల్పించకుండానే ప్లాట్లను అధిక ధరలకు విక్రయించి కోట్ల రూపాయల సొమ్మును వెనకేశారు.
గ్రామ పంచాయతీ నోటీసులను బేఖాతార్..
ఈ వెంచర్ ను 2023 కంటే ముందే వేశారు. అయితే ఈ అక్రమ వెంచర్ ఏర్పాటుపై వచ్చిన ఫిర్యాదులను విచారణ చేసిన గ్రామపంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023లో గ్రామపంచాయతీకి వచ్చిన ఫిర్యాదుల కు స్పందించిన పంచాయతీ సెక్రెటరీ విచారణ జరిపారు. 2023 జనవరిలో వెంచర్ నిర్మాణం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేశారు. 2023 మే నెలలో సర్వేనెంబర్ 125/ఇ/1/2 ఎటువంటి అనుమతులు లేకుండా హద్దురాళ్ళు నాటినట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. ఆ హద్దురాలను 24 గంటల్లో తొలగించాలని లేనియెడల గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా హద్దురాలను అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగిస్తామని గ్రామపంచాయతీ నోటీసులలో పేర్కొంది. అయితే ఈ గ్రామపంచాయతీ నోటీసులు ఏమాత్రం పట్టించుకోకుండా సదరు వ్యక్తులు ప్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారు.
మామూలుగా తీసుకుంటున్న అధికారులు
నమాత్ పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన అక్రమ వెంచర్ తతంగం అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ వెంచర్ ఏర్పాటుచేసిన వారు రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు మామూలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ సెక్రటరీ అక్రమంగా లేఅవుట్ చేశారని ఎంపీ ఓ కు అందజేసిన రిపోర్టు లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఔట్ చేసినట్లు అక్కడ ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి గుర్తించినప్పటికీ జిల్లా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






