- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవ్రీ నైట్.. రైట్.. రైట్ !
అర్ధరాత్రి దాటాక విజయవాడ- కోదాడ జాతీయ రహదారిపై ఇసుకతో నిండిన వాహనాలు సరిహద్దులు దాటి మన రాష్ట్రంలోకి యథేచ్ఛగా

దిశ, కోదాడ: అర్ధరాత్రి దాటాక విజయవాడ- కోదాడ జాతీయ రహదారిపై ఇసుకతో నిండిన వాహనాలు సరిహద్దులు దాటి మన రాష్ట్రంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తుంటే సరిహద్దు చెక్‌పోస్టులు మూగబోయాయి. పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారో, లేరో తెలీని దుస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక రాష్ట్రానికి దిగుమతి అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. 'తిలా పాపం తలా పిడికెడు ' అన్నట్లుగా ఉంది. తెలంగాణ–ఆంధ్ర సరిహద్దుల్లో ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోతోంది. అర్ధరాత్రి తర్వాత రహదారులపై వరుసగా దూసుకెళ్తున్న లారీలు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద గుట్టు చప్పుడు లేకుండా దాటిపోతున్నాయి. ప్రజల కన్ను తప్పించలేని ఈ ఇసుక రవాణాపై పోలీసు యంత్రాంగం మాత్రం గాఢ నిద్రలోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాత్రి 12 గంటల తర్వాత నుంచే వ్యాపారం మొదలవుతోందని స్థానికులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ మార్గాల గుండా లారీలు వెళ్తున్నాయని సమాచారం. ఆంధ్ర ప్రాంతం నుంచి నదీ తీరాల వద్ద నుంచి ఇసుకను ట్రాక్టర్లతో లారీకి లోడ్ చేసి, సరిహద్దు దాటించి తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గుట్టు చప్పుడు కాకుండా రవాణా..
స్థానికుల వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు లారీలు వరుసగా ఇసుక లోడ్లతో బారులు తీరుతున్నాయి. వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన వాహనాలే కావడం గమనార్హం. రాత్రిపూట టోల్‌గేట్ల వద్ద 'మామూలు'గానే సరిహద్దు దాటుతున్నారని విశ్వసనీయ సమాచారం.
నామమాత్రంగా చెక్‌పోస్టులు..!
ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల మీదుగా వరుసగా ఇసుక లారీలు వెళుతున్నా ఏ శాఖ అధికారి వాటిని అడ్డుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ అక్రమాలకు ఊతమిస్తున్నాయి..
ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఏడుగురు కానిస్టేబుళ్లు ఈ అక్రమాల కారణంగానే బదిలీ అయ్యారు. ఆదివారం రాత్రి ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ పట్టుబడగా అంతకు ముందు మూడు లారీలు సీజ్ అయ్యాయి.
ఇసుక మాఫియాలకు బంగారు తివాచీ..
అక్రమార్కులు ఒక్కో ఇసుక లారీకి రూ.8 వేల నుంచి–రూ.15 వేల వరకు లాభం ఆర్జిస్తున్నారని ప్రాథమిక అంచనా. ప్రతి రాత్రి వందల కొద్దీ టన్నుల ఇసుక ఇలా తెలంగాణలోకి చేరుతోంది. మైనింగ్ శాఖ నిర్లక్ష్యం, పోలీసు అధికారుల మౌనం వెరసి ఇసుక మాఫియాలకు బంగారు బాట వేసినట్లైంది.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం..
ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ పనులు నిలిచిపోయాయి. మరోవైపు అక్రమ రవాణా మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ విషయంపై ప్రజలు, సామాజిక సంస్థలు గళం విప్పుతున్నా – సంబంధిత అధికారులు “పరిశీలిస్తున్నాం” అంటూ తప్పించుకుంటున్నారు. సంబంధిత అధికారులు పగటిపూట తమ కార్యాలయాల్లో కూర్చుని సర్క్యులర్‌లు మాత్రమే జారీ చేస్తారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఏ చర్యా ఉండదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకునే అధికారులే లేరా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరతతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రా ఇసుక తెలంగాణలోకి ఎలా వస్తుంది అని కోదాడలోని ఓ గుత్తేదారు ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ ఒకటే అయినపుడు మాఫియాలకు మినహాయింపు ఎందుకు ఆని ఆయన ప్రశ్నించారు.ఇసుక అక్రమ రవాణా ఆర్థికంగా పెద్ద ఎత్తున జరుగుతుండటంతో, ప్రత్యేక దళం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసు, రెవెన్యూ, మైన్స్ విభాగాలు కలిసి సమన్వయంతో పని చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
అర్ధరాత్రి ఆపరేషన్
లారీలు సాధారణంగా రాత్రి 1 నుండి ఉదయం 4 గంటల మధ్యలో కదలికలో ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారుల మౌనం కూడా మాఫియాకు వాతావరణాన్ని కల్పిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.రాత్రి పూట నది తీరాల వద్ద లారీలు నిలబడి ఉంటాయి. వందల టన్నుల ఇసుకను గంటల్లో లోడ్ చేసి తెలంగాణలోకి తరలిస్తున్నారు. ఆ చెక్‌పోస్టుల్లో ఎవరు ఆపడం లేదు” అని ఓ డ్రైవర్ అజ్ఞాతంగా తెలిపారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
నదుల నుంచి నిరంతరంగా ఇసుక తీస్తే భవిష్యత్తులో భూగర్భ జలాల స్థాయిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.






