జోరుగా అక్రమ రేషన్ దందా.. ఆంధ్రాకు తరలింపు

by Jakkula.Mamatha |

ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది.

జోరుగా అక్రమ రేషన్ దందా.. ఆంధ్రాకు తరలింపు
X

దిశ, మిర్యాలగూడ: ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. పేదల కోసం చేపడుతున్న సన్న బియ్యం ను కొందరు అక్రమ సంపాదన కోసం పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో రేషన్ డీలర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద ప్రజలకు చేరవలసిన సన్నబియ్యం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నాయి. పట్టణంలోని రేషన్ డీలర్లు స్వయంగా కార్డుదారుల నుంచి కేజీ 15 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని ఓ మధ్యవర్తి ద్వారా విక్రయించి ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు రేషన్ బియ్యం పై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి రేషన్ బియ్యం అక్రమ దందాను నియంత్రించారు. కాగా ఇటీవల కాలంలో మరోసారి అక్రమ వ్యాపారులు దందాను మొదలుపెట్టారు.

రేషన్ షాపుల వద్ద కొనుగోలు..

రేషన్ అక్రమ వ్యాపారంలో డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రేషన్ షాప్ వద్దనే కస్టమర్ల నుంచి కేజీ 15 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని కేజీ 19 రూపాయల చొప్పున అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. కొనుగోలు చేసిన బియ్యాన్ని రాత్రి సమయంలో భారీ వాహనాలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్లు కొనుగోలు చేయడం వలనే వ్యాపారం మళ్ళీ మొదలైందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిలిచి పోయినప్పటికీ పట్టణాల్లో మాత్రం కొనసాగుతుండడంతో పట్టణ పోలీసులు వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీసులు 8 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ సమాచారం బయటకు పోకుండా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం పట్టుకున్న విషయం ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆంధ్ర ప్రాంతానికి తరలింపు

వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యం ను రాత్రి సమయంలో ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. డీలర్లు కొనుగోలు చేసిన బియ్యాన్ని ఒకచోట డంపు గా వేసి చిన్న ఆటో ద్వారా పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి పెద్ద వాహనాలతో ఓ మధ్యవర్తి ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. కేజీ కి 25 రూపాయల చొప్పున ఆంధ్రాలో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో వాహనాలను తరలించేందుకు కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. పట్టణ డీలర్ ల పై నిఘా ఉంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story