- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు మట్టి అక్రమ దందా.. మామూళ్ల మత్తులో అధికారులు
భూదాన్ పోచంపల్లి మండలంలోని కప్రాయపల్లి గ్రామంలో ఉన్న ఒక చెరువులో దాదాపు రెండు నెలలుగా మట్టిని తరలిస్తున్నారు. చెరువులో నుంచి రోజుకు పది టిప్పర్లు చెరువు మట్టిని బయటికి తరలిస్తున్నారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : మండలంలోని కప్రాయపల్లి గ్రామంలో ఉన్న ఒక చెరువులో దాదాపు రెండు నెలలుగా మట్టిని తరలిస్తున్నారు. చెరువులో నుంచి రోజుకు పది టిప్పర్లు చెరువు మట్టిని బయటికి తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ కనీసం 10 ట్రిప్పులను చెరువు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన చూస్తే సుమారు 100 ట్రిప్పుల మట్టి అక్రమంగా బయటకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక ట్రిప్పు మట్టికి రూ.7వేలు
చెరువుల మట్టి ఇటుకలు తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అందుకే దానికి చాలా ఖరీదు కలిగి ఉంటుంది. రోజుకు సుమారు 100 ట్రిప్పుల మట్టిని చుట్టు పక్కల ప్రాంతాలలో తయారుచేసే ఇటిక బట్టిలకు వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్క ట్రిప్పు విలువ సుమారు రూ.7వేలు.. ఆ లెక్కన రోజు 100 ట్రిప్పులు బయటికి తరలిస్తున్న మట్టి విలువ దాదాపు రూ.7లక్షలు అవుతుంది. రోజు రూ.7లక్షలు అయితే నెలకు రూ.2 కోట్ల పైచిలుకు మట్టి వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది.
మామూళ్ల మత్తులో అధికారులు ?
చెరువులో నుంచి మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడం లేదు. మట్టి వ్యాపారులు అధికారులకు మామూళ్లు అందజేయడం వల్లే అధికారులు ఆ వైపు కూడా రావట్లేదనేది చర్చ జరుగుతుంది. మట్టి తరలింపు విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ అధికారి దృష్టికి తీసుకెళ్లగా "మేము కూడా గమనిస్తున్నాం. మరో రెండు రోజుల్లో తరలింపు నిలిపివేస్తాం" అంటూ సెలవిచ్చారు తప్ప ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. అక్రమ మట్టి తరలింపు విషయమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించి ప్రయత్నం చేయగా కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇప్పటికైనా అధికారులు చెరువు మట్టి తరలిస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






