..అనే నేను సర్పంచిగా..!

by Thanuru Gopichand |

సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల రాకతో కొత్త కళ రాబోతోంది.

..అనే నేను సర్పంచిగా..!
X

దిశ, తుంగతుర్తి/కనగల్లు: సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల రాకతో కొత్త కళ రాబోతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇన్నాళ్లూ పాలకవర్గాలు లేక నిర్వహణ కరువైన కార్యాలయాలకు బూజు దులిపి, రంగులు వేసి తుది మెరుగులు దిద్దారు. తమ గ్రామాలకు కొత్త సర్పంచ్ రాబోతుండడంతో అటు ప్రజల్లోనూ, ఇటు నూతన ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం నెలకొన్నది. ఈ ప్రమాణ స్వీకారంతో పల్లెల్లో మళ్లీ ప్రజాపాలన మొదలై నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఊపందుకుంటాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు సోమవారం నుంచి అధికారికంగా కొలువు తీరబోతున్నాయి. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 104 గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు 948 మంది వార్డు సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలాల వారీగా చూస్తే, అత్యధికంగా తుంగతుర్తి మండలం నుంచి 24 గ్రామాలు, 218 వార్డు సభ్యులు, నూతనకల్ నుంచి 17 గ్రామాల్లో 166 వార్డు సభ్యులు, జాజిరెడ్డిగూడెంలో 17 గ్రామాల్లో 152 వార్డు సభ్యులు, మద్దిరాలలో 16 గ్రామాలు, 148 వార్డు సభ్యులు, నాగారంలో 14 గ్రామాలు, 132 వార్డు సభ్యులు ఉన్నాయి. అతి తక్కువగా తిరుమలగిరి మండలం నుంచి 16 గ్రామాల సర్పంచులు, 132మంది వార్డు సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రమాణ స్వీకారం చేయించనుండగా, కొన్ని చోట్ల గెజిటెడ్ హోదా కలిగిన ఉపాధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగించారు.

అత్యధికులు విద్యావంతులే...

ఈసారి ఎన్నికైన సర్పంచుల్లో అత్యధికులు విద్యావంతులు కావడం విశేషం. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా చరిత్రలో తుంగతుర్తి గ్రామ సర్పంచ్ విజయం ఒక రికార్డుగా నిలిచింది. ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన మల్లెపాక సాయిబాబు ఏకంగా 1,789ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఇంతటి మెజారిటీ రావడం ఇదే తొలిసారి అని చర్చించుకుంటున్నారు.

ప్రమాణ స్వీకారం పండుగలా...

తమ తొలి ప్రమాణ స్వీకారాన్ని పండుగలా నిర్వహించుకోవాలని నూతన ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు. బంధుమిత్రులకు, ఆత్మీయులకు ప్రత్యేక ఆహ్వాన పత్రాలు పంపి మరీ పిలుచుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం గ్రామాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

ముస్తాబైన గ్రామ పంచాయతీలు

-రంగులు వేసి కార్యాలయాలను సిద్ధం చేసిన సిబ్బంది

దిశ, కనగల్ : సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త కల రాబోతోంది. ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కనగల్ మండల పరిధిలోని ధర్వేశిపురం సహా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇన్నాళ్లూ పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీ కార్యాలయాలు నిర్వహణ కరువై బూజు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించడంతో, సిబ్బంది కార్యాలయాల్లోని బూజు దులుపుతూ, రంగులు వేస్తూ తుది మెరుగులు దిద్దుతున్నారు. తమ గ్రామానికి కొత్త సర్పంచ్ రాబోతుండటంతో అటు ప్రజల్లోనూ, ఇటు నూతన ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం నెలకొంది.

Next Story