హుజూర్‌నగర్ రిమాండ్ ఖైదీ మృతి.. త‌ల్లికి ప‌రిహారం అంద‌జేత

by Nallavelli.Anjaneyulu |

సీఎంఆర్ఎఫ్ చెక్ అక్రమ విషయమై చిలుకూరు పోలీస్ స్టేషన్ లో కోదాడకు చెందిన కర్ల రాజేష్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

హుజూర్‌నగర్ రిమాండ్ ఖైదీ మృతి.. త‌ల్లికి ప‌రిహారం అంద‌జేత
X

దిశ, కోదాడ : సీఎంఆర్ఎఫ్ చెక్ అక్రమ విషయమై చిలుకూరు పోలీస్ స్టేషన్ లో కోదాడకు చెందిన కర్ల రాజేష్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో హుజూర్‌నగర్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజేష్ అనారోగ్యంతో డిసెంబ‌ర్ 16, 2025న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత ఆరోపిత పోలీస్ అధికారులపై కేసు నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం.. అధికారులు విచారణ నిర్వహిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు గురువారం ఓ ప్రెస్ నోట్ లో తెలిపారు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు చిలుకూరు పీఎస్ అప్పటి ఎస్‌ఐ సురేష్ రెడ్డి, కోదాడ గ్రామీణ అప్పటి సీఐ ప్రతాప్ లింగాలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణ నిబంధనల ప్రకారం మరో కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు నల్గొండ జిల్లా డీసీఆర్‌బీ డీఎస్పీ జీ .రవిని అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సూచనల మేరకు నియమించారు. ఈ ఘటన నేపథ్యంలో గత నెల 23న సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ పంపిన ప్రతిపాదనల మేరకు మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల 12 వేల 500 పరిహారం మంజూరైంది. దానిని డిసెంబర్ 26న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మృతుడి తల్లి కర్ల లలితకు బ్యాంకు చెక్కు ద్వారా అందజేశారు. ఖైదీ మృతికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులపై నమోదైన రెండు కేసులపై చట్ట నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగుతోందని కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి వెల్ల‌డించారు.

Next Story