- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యం
దిశ, సూర్యాపేట : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్

దిశ, సూర్యాపేట : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో జర్నలిస్టులకు చేసిన మేలు శూన్యమని అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద జారీ చేసిన అక్రెడిటేషన్ల జీవో తప్పుల తడకగా ఉందని అన్నారు. అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 252 జర్నలిస్టులకు అన్యాయం చేసేదిగా ఉందని,జర్నలిస్టులకు అన్యాయం చేసే ఇలాంటి జీవోలెందుకని ప్రశ్నించారు. ఈ జీవోను వెంటనే సమీక్షించి సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా కేవలం కొద్ది మంది జర్నలిస్టులకే మేలు జరుగుతుందని, మెజారిటీ జర్నలిస్టులకు, ముఖ్యంగా చిన్న పత్రికల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ద్వారా ప్రభుత్వం చిన్న పత్రికలను చిదిమేస్తూ మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు చేసిందని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 239కు ఈ జీవోకు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరికి చిన్న, మధ్య తరహా పత్రికల నోట్లో మట్టి కొట్టే విధంగా రూల్స్ తయారు చేశారని దుయ్యబట్టారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేదంటే పూర్తిగా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ రెండేండ్లు గడిచినా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని విమర్శించారు. విభిన్న ప్రకటనలతో రెండేళ్లుగా జర్నలిస్టులను అయోమయానికి గురిచేశారని, కమిటీల పేరుతో సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేశారని అన్నారు. జర్నలిస్టులను మభ్యపెట్టేందుకు తప్పుడు ప్రకటనలు చేయడం సరైంది కాదని, ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం లేని సమస్యలను కూడా పరిష్కరించకపోవడం శోచనీయమని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల ఊసే లేదని, సుప్రీం కోర్టు తీర్పు సాకుతో ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే హామీ నుంచి తప్పించుకుంటున్నదని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం తగదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తం గా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న జర్నలిస్టుల పెన్షన్ స్కీం, మన రాష్ట్రంలో అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పత్రికలు మరింత చితికిపోతున్నాయని, అడ్వర్టయిజ్మెంట్లు లేక, రావాల్సిన బిల్లులు రాక పత్రికలు మనుగడ సాగించలేకపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల ఒకటో తేదీన రాష్ట్ర సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కార్యాలయం ఎదుట తాము ధర్నా చేయడం వల్ల ఆగమేఘాల మీద అక్రెడిటేషన్ల జీవో జారీ చేసిందని, మిగతా సమస్యలపై ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఫెడరేషన్ జిల్లా మాజీ కార్యదర్శి పాల్వాయి జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్ హక్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా అడ్ హక్ కమిటీ ఏర్పడింది. కమిటీ అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య , కో-కన్వీనర్లుగా ముషం హరి, లింగాల సాయి, శ్రీరాముల కృష్ణ, దోరేపల్లి శ్రీనివాస్, తాందారుపల్లి శ్రీనివాస్, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్ (ప్రభు), ఒగ్గు సోమన్న, కొంగల సతీష్, షేక్ నజీర్, వంగాల వెంకన్న తదితరులు నియమితులయ్యారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు, జిల్లా మహాసభలు జరుగుతాయని ఫెడరేషన వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రకటించారు.






