- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
దిశ, నల్లగొండ క్రైం : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.

దిశ, నల్లగొండ క్రైం : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన, నిరాదరణకు గురైన, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలను గుర్తించి రక్షించి వారి భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్– 12 కార్యక్రమాన్ని పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మాట్లాడుతూ, జనవరి 1 నుంచి 31వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరిలో “ ఆపరేషన్ స్మైల్ ”, జూలైలో “ ఆపరేషన్ ముస్కాన్ ” కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్‌ల పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వివరించారు.
బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్ ప్రాంతాలు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, లాడ్జ్‌లు, ధాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, మినరల్ వాటర్ సరఫరా కేంద్రాలు, వర్క్‌షాప్‌లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన లేదా వదిలివేయబడిన పిల్లలు, వివిధ రకాల బాల కార్మికులు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా అవసరమైతే స్టేట్ హోమ్‌కు పంపించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలతో బలవంతపు పని చేయించడం, వెట్టి చాకిరీ చేయించడం, వారి స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించడం చట్టరీత్యా ఘోర నేరమని హెచ్చరిస్తూ, అటువంటి ఘటనల్లో పాల్పడే వ్యక్తులు, యాజమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నట్లు, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్‌లైన్ లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హరిత , డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ భిక్షపతి, ఏహెచ్.టి యూఎస్ఐ రంగారెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్,హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






