చౌటుప్పల్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by Bhanu |   (  Updated:2025-07-22 09:42:08  IST  )

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

చౌటుప్పల్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం చౌటుప్పల్‌లోని బీఆర్కే కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదలకు మేం ఆశ చూపించాం. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి, సన్న బియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే మా లక్ష్యం, అని చెప్పారు. గతంలో రేషన్ ద్వారా వచ్చిన నాణ్యతలేని బియ్యం దళారుల చేతిలో పోయేదని, ఇప్పుడు ప్రతి పైసా నిజమైన లబ్ధిదారులకే ఉపయోగపడేలా ప్రభుత్వం వ్యవస్థను మెరుగుపరిస్తోందన్నారు.

తాను సభాముఖంగా హామీ ఇచ్చినట్లు, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కల్పించేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొటిగా నెరవేరుస్తున్నాం. ఎవరికీ అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలను అందించేందుకు అధికారులంతా బాధ్యతతో పనిచేయాలి, అని సూచించారు. అలాగే, అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వడం కూడా ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పోరాడినవారు గత ప్రభుత్వం కాలంలో నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని, రాష్ట్రానికి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌యే అని, పేదలకు న్యాయం చేయగలిగేది కూడా కాంగ్రెస్‌యే అని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఏదీ ఇవ్వకపోగా, పాత కార్డుల్లో పేర్లు కూడా జోడించలేకపోయింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదల అవసరాలను గుర్తించి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటం అభినందనీయం, అన్నారు. దళితులు, బీసీలకు సరైన విధంగా సంక్షేమ పథకాలు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో వెలమ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ వీరబాయి, పబ్బు రాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ జెడ్పిటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కొయ్యడ సైదులు గౌడ్, కాసర్ల శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ బాబా షరీఫ్, బొబ్బిళ్ల మురళి, అంతటి బాలరాజు, బొడిగె బాలకృష్ణ, మొగుదాల రమేష్ గౌడ్, చింతల సాయిలు, సందగళ్ల సతీష్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story