- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గత పదేళ్లలో కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు అన్యాయం : మంత్రి ఉత్తమ్
గత ప్రభుత్వం లోని 10 సంవత్సరాల కాలంలో కృష్ణా నది జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆంధ్రకు నీటి తరలింపు చేశారని తెలంగాణకే 70 శాతం నీటిని వాడుకుని వెసులుబాటు కల్పించాలని బచావత్ ట్రిబ్యునల్ కమిటీ పున:పరిశీలన చేసే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

దిశ, మిర్యాలగూడ : గత ప్రభుత్వం లోని 10 సంవత్సరాల కాలంలో కృష్ణా నది జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆంధ్రకు నీటి తరలింపు చేశారని తెలంగాణకే 70 శాతం నీటిని వాడుకుని వెసులుబాటు కల్పించాలని బచావత్ ట్రిబ్యునల్ కమిటీ పున:పరిశీలన చేసే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో ఆయా శాఖలపై ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాలలో ఆంధ్రాకు ఎక్కువ నీటి తరలింపు జరిగిందని మండిపడ్డారు. బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ద్వారా 811 టిఎంసిలగాను గత ప్రభుత్వం తెలంగాణకు కేవలం 218 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేందుకు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనాభాను, ఆయకట్టు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని 70% నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకునే విధంగా బ్రిజేష్ కుమార్ కమిటీ పున:పరిశీలన చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో పూడిక కారణంగా నీటి నిలువ సామర్థ్యం తగ్గిందని అన్నారు.
ఇరిగేషన్ శాఖను బలోపేతం చేయడం కోసం 1100 మంది ఇంజనీర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. దీంతోపాటుగా ప్రాజెక్టులు, కాలువల పటిష్టం కోసం బడ్జెట్ సమావేశంలో 23 వేల కోట్ల రూపాయలను కేటాయించగా 1800 మంది లస్కర్ల నియామకానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. వీటితో పాటు డిండి ప్రాజెక్టుకు 1800 కోట్లు మంజూరు చేసామని గండమల్ల రిజర్వాయర్, ఉదయ సముద్రం ప్రాజెక్టుల నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, అసమర్థత వలన, డిజైన్ లోపం వలన కాలేశ్వరం ప్రాజెక్టు 94 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిరుపయోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డబ్బుతో మరిన్ని ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారేదని అన్నారు. గత వాన కాలంలో 66.7 లక్షల ఎకరాలలో 153.58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారని, వేసవికాలంలో 55 లక్షల ఎకరాలలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగైందని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం సాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తించబడ్డదన్నారు. కొనుగోలు కేంద్రాలలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి రైతు వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయం మేరకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున మూడు కోట్ల 10 లక్షల మందికి 13 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సన్న బియ్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులను, తూములను వేసవి కాలంలో పూర్తిచేసి నీటి నిల్వను పెంచే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
పేదవారి రెండు పూటల కడుపు నింపేందుకు సన్న బియ్యం - మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలోని ప్రతి పేదవారి రెండు పూటల కడుపు నింపేందుకే సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నట్లు ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులన్నీటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రోడ్ల నిర్మాణాల కోసం 1500 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తున్నామని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ వల్లనే 10 సంవత్సరాల పాటు పాలన చేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి మెయిన్ కెనాల్ కు 44 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు బెడ్డు విడ్త్ లైనింగ్ ను నాలుగు మీటర్లకు పెంచాలని సూచించారు. వేసవికాలంలోనే కాలువల మరమ్మతులు చేపట్టి వర్షాకాలంలో సాగునీటికి ఇబ్బంది కలకుండా చూడాలని కోరారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఆయన నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. సమావేశంలో ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, కేతావత్ శంకర్ నాయక్, ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ, సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ చౌహాన్, ఐ ఎన్ పి ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి కలెక్టర్లు ఈలా త్రిపాఠి, తేజస్ నందాలాల్, హనుమంతరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






